Begin typing your search above and press return to search.

ఉదయం ప్లానింగ్..సాయంత్రం సభలు.. సూరీడు దెబ్బకు మారిన షెడ్యూల్

కానీ.. మండే ఎండలతో లెక్కలు మారాయి. మొండిగా ప్రచారం చేస్తే మొదటికే మోసం వస్తున్న విషయాన్ని గుర్తిస్తున్న నేతలు.. తమ ప్రచారాన్ని మార్చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 April 2024 8:13 AM GMT
ఉదయం ప్లానింగ్..సాయంత్రం సభలు.. సూరీడు దెబ్బకు మారిన షెడ్యూల్
X

సాధారణంగా ఎన్నికలు అన్నంతనే భారీ సభలు.. సమావేశాలు.. తమ బలాన్ని.. బలగాన్ని ప్రదర్శించే రోడ్ షోలు తదితరాలు కామన్. అందుకు భిన్నమైన పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. ఎన్నికల వేళ.. క్షణం కూడా వేస్టు కాకుండా ప్రచారాన్ని నిర్వహిస్తుంటారు. అగ్రనేతలు మొదలు ఎన్నికల బరిలో ఉన్న నేతలంతా తెల్లవారుజాము మొదలు రాత్రి వరకు నాన్ స్టాప్ ప్రచారాన్ని చేపడుతుంటారు.

కానీ.. మండే ఎండలతో లెక్కలు మారాయి. మొండిగా ప్రచారం చేస్తే మొదటికే మోసం వస్తున్న విషయాన్ని గుర్తిస్తున్న నేతలు.. తమ ప్రచారాన్ని మార్చేస్తున్నారు. అగ్రనేతలు సైతం సూరీడు దెబ్బకు విలవిలలాడుతున్నారు. రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న ఎండల కారణంగా నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయంపూట ప్రచారాల్ని కుదించుకుంటున్నారు.

గతంలో అభ్యర్థులు తమ నియోజకవర్గ పరిధిలోని ప్రతి వీధి తిరిగేవారు. ప్రతి బస్తీని సందర్శించేవారు. ఎన్నికల ప్రచారం మొదలైన నాటి నుంచి పోలింగ్ సమయానికి కనీసం మూడుసార్లురి కవర్ చేయటం కనిపించేది. కానీ.. ఎండల తీవ్రతతో ఆ షెడ్యూల్ మారిపోయింది. ఇప్పుడు ఒకసారి కవర్ చేస్తే అదే గొప్పగా మారింది. గతంలో ఎన్నికల సమయంలో నాయకులు ఇళ్లకు వెళ్లటం.. వారి పనుల్లో భాగం కావటం.. రోడ్ల మీద ప్రచారం చేసే వేళలో.. కాఫీ కలపటం.. దోశెలు వేయటం.. బజ్జీలు వేయటం లాంటి పనులు చేయటం.. దానికి సంబంధించిన ఫోటోలు ఎక్కువగా మీడియాలో కవర్ అయ్యేవి.

ఇప్పుడు ప్రచారాన్ని చూస్తే అలాంటి సిత్రాలు కనిపించని పరిస్థితి. ఉదయం వేళలో ప్రారంభమయ్యే ప్రచారం పది గంటలు అయ్యేసరికి నేతలు ప్రచార ప్లానింగ్ మీద ఫోకస్ పెడుతున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించే కన్నా.. సోషల్ మీడియా.. వాట్సాప్ ప్రచారాలతో ప్రతి ఒక్కరి చేతిలో ఉండే సెల్ ఫోన్ కు చేరేలా ప్లాన్ చేస్తున్నారు. పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నీడ పట్టున ఉండేలా ప్లాన్ చేస్తున్ననేతలు.. ఐదు తర్వాత నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.

గతంలో మాదిరి సభలు.. సమావేశాలు.. రోడ్ షోలు నిర్వహిస్తే జనాల్ని తరలించటం ఇబ్బందిగా మారటంతో తమ ప్రచార విధానాన్ని మార్చేశారు. వీలైనంత ఎక్కువగా కార్నర్ మీటింగ్ లను నిర్వహిస్తున్నారు. ఉక్కపోత.. వడగాల్పుల నేపథ్యంలో జనాల్ని తరలించటం పెద్ద సమస్యగా మారింది. అనుకోని రీతిలో ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు నెలకొంటే.. వారిని పరామర్శించటం లాంటి అదనపు బాధ్యతల కారణంగా పని ఒత్తిడి మరింత పెరుగుతుందంటున్నారు. అందుకే.. సూరీడి భగభగలకు తాళలేని నేతలు తమ ప్రచార స్టైల్ ను మార్చేస్తున్న వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. గతంలో ఉదయం పూట ప్రచారం జోరుగా చేసేవారు. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా సాయంత్రం మొదలయ్యే ప్రచారం.. రాత్రి వేళలో జోరుగా సాగుతోంది.