Begin typing your search above and press return to search.

బీజేపీ కాసుల పార్టీ.. కాంగ్రెస్ కేసుల పార్టీ!

ఎన్నికల సంఘం ప్రామాణికతలు ఎలా ఉన్నప్పటికీ.. నిజమైన జాతీయ పార్టీలంటే కాంగ్రెస్, బీజేపీ మాత్రమే

By:  Tupaki Desk   |   15 Dec 2023 10:30 AM GMT
బీజేపీ కాసుల పార్టీ.. కాంగ్రెస్ కేసుల పార్టీ!
X

దేశంలో పేరుకు నాలుగైదు జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ.. అవన్నీ పేరుకే. ఎన్నికల సంఘం ప్రామాణికతలు ఎలా ఉన్నప్పటికీ.. నిజమైన జాతీయ పార్టీలంటే కాంగ్రెస్, బీజేపీ మాత్రమే. పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉండడం.. అక్కడి అసెంబ్లీల్లో కనీస సంఖ్యలో సీట్లను గెలుచుకుని ఉండడం.. జాతీయ పార్టీలకు ఉండాల్సిన అర్హతలుగా భావించాలి. ఇటీవల కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ హోదాను సాధించింది.

మొత్తం 6..

బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, ఆప్, ఎన్సీపీ, బీఎస్పీ.. దేశంలో జాతీయ పార్టీ హోదా దక్కిన పార్టీలివి. అయితే, వీటిలో కాంగ్రెస్, బీజేపీనే చాలా రాష్ట్రాల్లో ప్రభావం చూపుతున్నాయి. వీటి తర్వాత ఆప్ మాత్రమే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కలిగి ఉండడం గమనార్హం. మరోవైపు ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఖాతాలో రెండు చేరాయి. మధ్యప్రదేశ్ లో అధికారాన్ని నిలబెట్టుకుంది. తెలంగాణ కాంగ్రెస్ కు దక్కింది. ఈశాన్య రాష్ట్రం మిజోరంలో జడ్పీఎం విజయం సాధించాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచినవారిపైపై తాజాగా నేషనల్ ఎలక్షన్ వాచ్, ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) విశ్లేషణ చేశాయి.

ధన బలం.. భుజ బలందే అధికారం

తాజాగా ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో నాలుగు ముఖ్యమైనవే. తెలంగాణ.. హైదరాబాద్ వంటి పెద్ద నగరాన్ని కలిగి ఉంది. మరోవైపు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాజకీయంగా చాలా కీలకమైనవి. ఛత్తీస్ గఢ్ నూ తీసిపారేయలేం. అయితే, ఈ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో విజేతల్లో అత్యధికులు ధన బలం లేదా భుజ బలంతో గెలిచినవారేనని ఏడీఆర్, ఎలక్షన్ వాచ్ చెబుతోంది. రాజకీయాలు ధనమయం అయ్యాయనేందుకు చక్కటి నిదర్శనంగా కనిపిస్తోంది.

88 శాతం కోటీశ్వరులేనట..

ఇటీవలి ఫలితాల్లో విజయం సాధించిన 678 మందిలో 88 శాతం మంది కోటీశ్వరులేనని నేషనల్ ఎలక్షన్ వాచ్, ఏడీఆర్ నివేదిక చెబుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ఆస్తులను విశ్లేషిస్తే 594 మంది కోటీశ్వరులుగా తేలింది. ఇక మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న బీజేపీ నుంచే ఈ కోటీశ్వరులు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన 342 మంది ఎమ్మెల్యేలలో 298 మంది కోటీశ్వరులే. 44 మంది మాత్రమే కోటీశ్వరులు కారని స్పష్టమవుతోంది. మరోవైపు 235 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 209 మంది కోటీశ్వరులట.

బీఆర్ఎస్ లో ఒక్కరు మాత్రమే కోటీశ్వరులు కాదట..

తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే, 39 సీట్లను గెలుచుకుని గౌరవప్రద ఓటమిని పొందింది. వీరిలో 38 మంది కోటీశ్వరులేనట. మరి ఆ ఒక్కరు ఎవరనేది ఆసక్తికరం. ఇక మిజోరంలో 27 మంది జడ్పీఎం ఎమ్మెల్యేల్లో 22 మంది కోటీశ్వరులే. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణలో 119 మందిలో 114 మంది, ఛత్తీస్‌ గఢ్‌లో 90 మందిలో 72 మంది, మిజోరంలో 40 మందిలో 34 మంది కోటీశ్వరులే కావడం గమనార్హం.

37 శాతం మందిపై క్రిమినల్ కేసులు

ఐదు రాష్ట్రాల్లో 678 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో 253 మందిపై.. (37 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది. 146 మంది అభ్యర్థుల (22 శాతం)పై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న 235 మందిలో కాంగ్రెస్ వారు 114 మంది. 66 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై తీవ్ర నేరారోపణలు ఉణ్నాయి. బీజేపీకి చెందినవారిలో 105 మందిపై క్రిమినల్ కేసులుంటే, 51 మంది తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.