Begin typing your search above and press return to search.

అభ్య‌ర్థుల మెజారిటీ కంటే.. నోటా ఓట్లే ఎక్కువ బ్రో!

తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కొన్ని చిత్ర‌మైన ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి

By:  Tupaki Desk   |   5 Jun 2024 5:22 PM GMT
అభ్య‌ర్థుల మెజారిటీ కంటే.. నోటా ఓట్లే ఎక్కువ బ్రో!
X

తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కొన్ని చిత్ర‌మైన ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. అభ్య‌ర్థుల‌కు వ‌చ్చిన మెజారిటీ కంటే.. ఈవీఎంలో చిట్ట చివ‌ర ఉండే.. `నోటా`(నన్ ఆఫ్ ది ఎబౌ-పైవారెవ‌రూ వ‌ద్దు)కు ప‌డిన ఓట్లే ఎక్కువ‌గా ఉండ‌డం కొన్న కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నిపించింది. నిజానికి ఆయా ఓట్లు క‌నుక అభ్య‌ర్థుల‌కు ప‌డి ఉంటే.. ఫ‌లితాలు తారుమార‌య్యేవి. కానీ, ఎక్కువ మంది వేల సంఖ్య‌లో ఓట‌ర్లు మాత్రం నోటాకు గుద్దేశారు. దీంతో స్వ‌ల్ప మెజారిటీతో చాలా మంది అభ్య‌ర్థులు విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ చిత్ర‌మైన నియోజ‌క‌వ‌ర్గాలు ఇవీ..

+ మహారాష్ట్రలోని ముంబై ఉత్తర నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచిన అభ్య‌ర్థికి 48 ఓట్ల మెజారిటీ వ‌స్తే.. నోటాకు ఏకంగా 15161 ఓట్లు పోల‌య్యాయి. దీంతో అంద‌రూ అవాక్క‌య్యారు. ఇక్క‌డ ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివ‌సేన పార్టీకి, మాజీ సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే నేతృత్వంలోని యూబీటీ శివ‌సేన‌కు మ‌ధ్య హోరా హోరీ పోరు సాగింది. అయితే.. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన త‌ర‌ఫున పోటీ చేసిన ర‌వీంద్ర వైక‌ర్ విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈయ‌న‌కు 48 ఓట్ల మెజారిటీ మాత్ర‌మే ద‌క్కింది. కానీ, నోటాకు మాత్రం15,161 ఓట్లు పోల‌య్యాయి.

+ కేరళలోని అత్తింగళ్ పార్ల‌మెంటు స్థానంలో కూడా.. నోటాకు వేల సంఖ్య‌లో ఓట్లు కురిశాయి. ఇక్క‌డ ఏకంగా 9761 ఓట్లు నోటాకు గుద్దేశారు. ఇక‌, గెలిచిన కాంగ్రెస్ అభ్య‌ర్థి అదూర్ ప్ర‌కాశ్‌కు మాత్రం 684 ఓట్ల మెజారిటీ ల‌భించింది. అలా కాకుండా.. నోటాకు ప‌డిన ఓట్లు కూడా అభ్య‌ర్థికి ప‌డి ఉంటే ఫ‌లిత‌మే తారుమార‌య్యేది. ఇక్క‌డ నుంచి సీపీఎం త‌ర‌ఫున జాయ్ పోటీలో ఉన్నారు.

+ ఒడిశాలోని జ‌య‌పురం నియోజ‌క‌వ‌ర్గంలో నోటాకు ఏకంగా 6,788 ఓట్లు ప‌డ్డాయి. కానీ, గెలిచిన అభ్య‌ర్థి, బీజేపీ నేత ర‌బీంద్ర నారాయ‌ణ్ బెహ‌రాకు మాత్రం 1587 ఓట్ల మెజారిటీ మాత్ర‌మే ద‌క్కింది. ఇక్క‌డ నుంచి బ‌రిలో నిలిచిన బిజు జ‌న‌తాద‌ళ్ అభ్య‌ర్థి శ‌ర్మిష్టా సేథి.. ఓడిపోయారు.

+ రాజస్థాన్‌లోని జైపూర్‌ రూరల్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఎక్కువ మంది నోటాకు ఓటేశారు. ఇక్క‌డ కూడా 7519 ఓట్లు నోటాకు ప‌డ్డాయి. ఇక‌, విజ‌యం ద‌క్కించుకున్న కాంగ్రెస్‌ అభ్యర్థి అనిల్ ఛోప్రా కేవ‌లం 1615 ఓట్ల మెజారిటీతోనే విజ‌యం ద‌క్కించుకున్నారు.

+ ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధికంగా.. నోటాకు 18,669 ఓట్లు వ‌చ్చాయి. ఇక్క‌డ నుంచి బ‌రిలో నిలిచిన బీజేపీ అభ్య‌ర్థి భోజ్‌రాజ్ నాగ్ కేవలం 1884 ఓట్ల మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్నారు.