Begin typing your search above and press return to search.

బీఆర్‌ఎస్‌ కు 'గుర్తు' కష్టాలు!

తమ పార్టీ గుర్తు అయిన కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని ఢిల్లీ హైకోర్టులో బీఆర్‌ఎస్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

By:  Tupaki Desk   |   12 Oct 2023 11:49 AM GMT
బీఆర్‌ఎస్‌ కు గుర్తు కష్టాలు!
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన సంగతి తెలిసిందే. నవంబర్‌ 30న పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 3 ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అస్త్రశస్త్రాలకు పదునుపెడుతున్నాయి.

ప్రధానంగా అధికారం కోసం పోరాటం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్యే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అధికార బీఆర్‌ఎస్‌ తమ పార్టీ గుర్తు అయిన కారును పోలిన ఎన్నికల గుర్తులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

బీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు కారు అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే గతంలో పలు ఎన్నికలు, ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓట్లు చీల్చి ఆ పార్టీకి నష్టం చేకూర్చడానికి కొంతమంది ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కారు గుర్తును పోలిన ట్రక్కు, ఆటో ట్రక్కు, అంబులెన్సు ఇలాంటి వాటితో పోటీ చేశారు. దీంతో ఓటర్లు అయోమయానికి గురై కారును పోలిన గుర్తులకు సైతం భారీగానే వేశారు. దీంతో ఆ మేరకు బీఆర్‌ఎస్‌ ఆయా స్థానాల్లో ఓడిపోవడం లేదా మెజారిటీ తగ్గడం జరిగింది.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ కారును పోలిన గుర్తులతో బీఆర్‌ఎస్‌ కు నష్టం కలిగే ప్రమాదం ఉండటంతో ఆ పార్టీ గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇచ్చింది. కారును పోలి ఉన్న గుర్తులను ఏ పార్టీకి కేటాయించవద్దని కోరింది.

అయితే కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్‌ఎస్‌ కోరికను పట్టించుకోకపోవడంతో ఆ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తమ పార్టీ గుర్తు అయిన కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని ఢిల్లీ హైకోర్టులో బీఆర్‌ఎస్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

బీఆర్‌ఎస్‌ తరపున న్యాయవాది మోహిత్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టే లోపే బీఆర్‌ఎస్‌ ఆ పిటిషన్‌ ను వెనక్కి తీసుకోవడం హాట్‌ టాపిక్‌ గా మారింది. తాజాగా ఇదే అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. సర్వోన్నత న్యాయస్థానంలో బీఆర్‌ఎస్‌ పిటిషన్‌ దాఖలు చేయనుంది.

కారును పోలిన గుర్తులను ఎన్నికల కమిషన్‌ తొలగించాలని లేదా ఎవరికీ కేటాయించకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ భారత రాష్ట్ర సమితి సుప్రీంకోర్టును కోరనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు బీఆర్‌ఎస్‌ కు అనుకూలంగా తీర్పు ఇస్తుందా? లేదా? తీర్పు అనుకూలంగా లేకపోతే బీఆర్‌ఎస్‌ ఎలా వ్యహరిస్తుందనేది ఆసక్తి రేపుతోంది.