ఆ 2 చోట్ల అప్పట్లో తండ్రులు.. ఇప్పుడు కొడుకుల మధ్య ఎన్నికల 'వార్'
ఈ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల ఫైట్ ఆసక్తికరంగానే కాదు.. అందరిని ఆకర్షిస్తోంది.
By: Tupaki Desk | 14 Nov 2023 4:12 AM GMTతెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావటం.. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ దిశగా పార్టీలు.. అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎవరికి వారు తమదైన వ్యూహాల్ని అమలు చేస్తూ అడుగులు వేస్తున్నారు. గెలుపే ధ్యేయంగా సాగుతున్న ఈ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల ఫైట్ ఆసక్తికరంగానే కాదు.. అందరిని ఆకర్షిస్తోంది.
ఎందుకంటే.. ఏళ్లకు ఏళ్లు గడిచినా ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రత్యర్థులుగా ఒకే కుటుంబానికి చెందిన వారు తలపడటమే దీనికి కారణం. ఎన్నికలు ఎన్నిసార్లు జరిగినా.. ప్రత్యర్థులుగా వారే ఉండటం ఒక ఎత్తు అయితే.. గతంలో తండ్రుల మధ్య ఎన్నికల వార్ జరిగితే.. ఇప్పుడు వారి వారసులైన కొడుకుల మధ్య సాగుతున్న ఎన్నికల రణం.. రోటీన్ కు భిన్నంగా ఉందని చెప్పాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే.. ఈ నియోజకవర్గం జానారెడ్డి అడ్డా. 1983 నుంచి 2014 వరకు ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం.. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఆయన సుదీర్ఘకాలం పని చేశారు.
2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చాలకుర్తి నుంచి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున జానారెడ్డి.. బీఆర్ఎస్ తరఫున నోముల నర్సయ్య తలపడ్డారు. 2014లో నోములపై జానారెడ్డి గెలిస్తే.. 2018లో జానారెడ్డిపై నోముల నర్సింహయ్య విజయం సాధించారు. అయితే.. అనూహ్యంగా నోముల హఠాన్మరణంతో జరిగిన ఉప పోరులోనే జానారెడ్డిపై నోముల తనయుడు భరత్ పోటీ చేసి విజయం సాధించటం తెలిసిందే.
తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భరత్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే.. కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి కుమారుడు జైవీర్ తొలిసారి ఎన్నికల గోదాలోకి దిగారు. దీంతో.. తండ్రుల మధ్య మొదలైన ఎన్నికల పోరు ఇప్పుడు కొడుకుల మధ్య కంటిన్యూ కావటం ఆసక్తికరంగా మారింది. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ ఇలాంటి సీనే నడుస్తోంది. ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో సాగుతున్న తాజా పోరు అందరిని ఆకర్షిస్తోంది.2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఏర్పడిన కోరుట్లలో మొదట్నించి వెలమ సామాజిక వర్గానిదే అధిపత్యం. నాలుసార్లు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు విజయాన్ని సాధించారు. ఒకప్పటి బీజేపీ కంచుకోటను గులాబీ పార్టీ ముట్టడించి.. స్వాధీనం చేసుకుంది.
2009 నుంచి గులాబీ పార్టీ హవానే నడుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2010 ఉప ఎన్నికల్లోనూఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తరఫున విద్యాసాగర్ రావు.. కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి జువ్వాది రత్నాకర్ రావులు తలపడ్డారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విద్యాసాగర్ రావును జువ్వాది తనయుడు నర్సింగరావు ఢీ కొన్నారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ తరఫున.. జువ్వాది నర్సింగరావు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకిదిగారు. నాడు తండ్రుల మధ్య సాగిన పోరుకు కొనసాగింపుగా నేడు కొడుకుల మధ్య ఎన్నికల వార్ నడుస్తోంది. మరి.. ఈసారి విజయం ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది.