Begin typing your search above and press return to search.

విశాఖ నుంచే స్మార్ట్ మీటర్ ప్రయోగం...జనాలకు ఓకేనా ?

ఏపీలో కూటమి ప్రభుత్వం ఒక వైపు విద్యుత్ బాదుడుకు తెర తీసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   7 Dec 2024 3:44 AM GMT
విశాఖ నుంచే స్మార్ట్ మీటర్ ప్రయోగం...జనాలకు ఓకేనా ?
X

ఏపీలో కూటమి ప్రభుత్వం ఒక వైపు విద్యుత్ బాదుడుకు తెర తీసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏకంగా 18 వేల కోట్ల రూపాయలను ట్రూ అప్ చార్జీల పేరుతో మోత మోగించిందని కూడా విమర్శిస్తున్నాయి. ఇది సామాన్యుడు తట్టుకోలేని పెను భారం అని అంటున్నాయి.

అయితే గత అయిదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం విద్యుత్ రంగంలో చేసిన అనేక పోరపాట్ల వల్లనే ఇపుడు ఈ అధిక భారం పడుతోందని మొత్తం అన్నీ సరిచేస్తున్నామని కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఈ పరిస్థితులలో విద్యుత్ బాదుడు మీద వామపక్షాలు పోరాటం చేశాయి. కాంగ్రెస్ కూడా షర్మిల నాయకత్వంలో ఉద్యమించింది. వైసీపీ ఈ నెల 13 నుంచి మూడు దశల పోరాటానికి పిలుపు ఇచ్చింది.

ఇదిలా ఉంటే దీనికి మరోటి అన్నట్లుగా ఏపీలో స్మార్ట్ మీటర్ల ప్రయోగానికి టీడీపీ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది అని అంటున్నారు. ఇది విద్యుత్ రంగంలో ప్రయోగం అని అంటున్నారు. ఒక విధంగా సంస్కరణలు అన్న మాట. మరి ఈ సంస్కరణలకు జనాల నుంచి ఏ మేరకు మద్దతు ఉంటుందో తెలియదు కానీ ఇది కూడా జనం నెత్తిన గుదిబండే అని వామపక్షాలు అపుడే విమర్శలు చేస్తున్నాయి.

స్మార్ట్ మీటర్లను ఇంటింటికీ బిగించడం ద్వారా విద్యుత్ శాఖ చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగం విద్యుత్ వినియోగదారులలో ఆందోళనలు రేకేత్తిస్తోంది. ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా ఎంత బిల్లు నెలకు వస్తుందో అన్న భయాలు అయితే ఉన్నాయి.

పైగా ఇది ప్రీ పెయిడ్ విధానంలో ఉంటుంది. అంటే నెలకు ఎన్ని యూనిట్లు వాడుతారో ఒక అంచనాకు వచ్చి ప్రీ పెయిడ్ గా మొత్తాలను చెల్లిస్తే ఆయా స్మార్ట్ మీటర్ల నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. ఇక ప్రీ పెయిడ్ విధానంలో రీచార్జి కనుక చేయక పోతే ఆ వెంటనే ఇంట్లో కరెంట్ పోతుంది. మొత్తం చీకటి అవుతుంది. ఇదంతా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అన్న మాట.

ఇపుడు విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే కొంత గ్రేస్ పీరియడ్ ఇస్తారు. అలాగే అపరాధ రుసుము వేస్తారు. ఆ తరువాత కానీ కరెంట్ కట్ అవదు. కానీ స్మార్ట్ మీటర్లు ఒకసారి బిగిస్తే కనుక వినియోగదారులకు కలిగే అతి పెద్ద ఇబ్బంది ఇది అని అంటున్నారు. ఇక విద్యుత్ స్మార్ట్ మీటర్ల వల్ల రీచార్జి విషయంలో అప్రమత్తంగా ఉందాల్సి ఉంది.

నిరక్షరాస్యులు చదువరులు కాని వారికి ఇది ఇబ్బందే అని అంటున్నారు. ఇక ఒక కుటుంబానికి సగటున వేయి రూపాయలు బిల్లు వస్తోంది అంటే వారు నెలకు సరిపడా వేయి రూపాయలు ప్రీ పెయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవసరం అయితే మరో వంద అదనంగా చేసుకున్నా తప్పు లేదు. ఎందుకంటే రోజూ ఒకేలా వాడతారని ఉండదు కాబట్టి మధ్యలో కట్ అవకుండా చూసుకోవచ్చు. ఇక ఎప్పటికపుడు రీచార్జి విషయంలో అలెర్ట్ ఉంటుందని అంటున్నారు. అలాగే ఎంత యూనిట్లు వాడకం చేశారో కూడా ఆన్ లైన్ లో చూసుకోవచ్చు అని చెబుతున్నారు. మరో వైపు చూస్తే విద్యుత్ దుర్వినియోగం కాదు అని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే విశాఖలోని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ మొట్టమొదటి స్మార్ట్ మీటర్ ని విశాఖ ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసింది. ఈ విధంగా మొదట

ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేసి అక్కడ పనితీరు చూస్తున్నారు. ఆ మీదట ఇళ్ళకు కూడా స్మార్ట్ మీటర్లను బిగిస్తారు. అది కూడా విశాఖ నుంచే స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు. ఒక్కో స్మార్ట్ మీటరుకు అయ్యే మొత్తాన్ని కూడా వినియోగదారులే భరించాల్సి ఉంటుందని అంటున్నారు. దానిని వాయిదా పద్ధతిలో నెలకు ఇంత అన్నట్లుగా వసూలు చేస్తారు అని అంటున్నారు.

ఇక ఏపీలో చూస్తే రాయలసీమలోని నంద్యాలలో కూడా ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే స్మార్టు మీటర్ల బిగింపుతో అధికంగా విద్యుత్ బిల్లులు వస్తాయని ప్రచారం అయితే సాగుతోంది. దీని మీద అధికారికంగా వివరణ అధికారులు ఇవ్వాల్సి ఉంది. అంతే కాకుండా సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తినా విద్యుత్ సడెన్ గా సరఫరా ఉండదని డౌట్లు ఉన్నాయి. వాటిని కూడా క్లారిఫై చేయాలి. అపుడే ఈ సంస్కరణలకు ఫలితం ప్రజామోదం ఉంటుందని అంటున్నారు.