జమిలి బిల్లుపై లోక్ సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్... టీడీపీ కీలక నిర్ణయం!
అవును... జమిలి ఎన్నికల బిల్లు నేడు పార్లమెంట్ ముందుకొచ్చింది. నేడు దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
By: Tupaki Desk | 17 Dec 2024 8:36 AM GMT"ఒకే దేశం - ఒకే ఎన్నిక" ప్రణాళిక నేడు తాజాగా పార్లమెంట్ ముందుకొచ్చింది. ఈ మేరకు నేడు లోక్ సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్ వాల్.. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ బిల్లు విషయంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది.
అవును... జమిలి ఎన్నికల బిల్లు నేడు పార్లమెంట్ ముందుకొచ్చింది. నేడు దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చలో.. కాంగ్రెస్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించగా.. ఎన్డీయే మిత్రపక్షాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి.
ఈ సందర్భంగా... ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీలు దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) కి పంపడానికి డివిజన్ కోరాయి. దీంతో.. జేపీసీకి పంపడానికి ముందు కేంద్రమంత్రి అర్జున్ రాం మేఘ్ వాల్ సభలో ఈ మేరకు ప్రతిపాదన పెట్టగా.. స్పీకర్ ఓబిర్లా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ డివిజన్ జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన ఎన్నికలో... జమిలీ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపడానికి అనుకూలంగా 220 మంది సభ్యులు ఓటు వేయగా.. వ్యతిరేకంగా 149 మంది ఓటు వేశారు. కాగా... కొత్త పార్లమెంట్ భవనంలో పూర్తి ఎలక్ట్రానిక్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి.
తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం!:
నేడు లోక్ సభలో ప్రవేశపెట్టిన జమిలి బిల్లుకు తెలుగుదేశం పార్టీ భేషరతుగా మద్దతు ఇచ్చింది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సభకు తెలియజేశారు. ఈ సందర్భంగా.. జమిలి ఎన్నికలతో ఖర్చు తగ్గి, సామర్థ్యం పెరుగుతుందని.. పోలింగ్ శాతం కూడా మెరుగవుతుందని.. నిరంతరం ఎన్నికలు నిర్వహించడం వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని అన్నారు.
ఫలితంగా.. దేశవ్యాప్తంగా ఎన్నికల ఖర్చు రూ.లక్ష కోట్లు దాటుతోందని తెలిపారు. సృజనాత్మక ఆలోచనలకు టీడీపీ ఎప్పుడూ మద్దతిస్తుందని కేంద్రమంత్రి పెమ్మసాని చెప్పుకొచ్చారు!
బిల్లుపై ఆయా పార్టీల నేతల రియాక్షన్స్..!:
ఈ సందర్భంగా సభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి అర్జున్ రాం మేగ్ వాల్ స్పందిస్తూ... జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కొత్తదేమీ కాదని.. 1983 నుంచి ఈ తరహా డిమాండ్ ఉందని.. దీనివల్ల రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని.. సమాఖ్య స్ఫూర్తికి ఇది ఏమాత్రం విరుద్ధం కాదని అన్నారు.
ఇదే సమయంలో... జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కేబినెట్ మీటింగ్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
అయితే... జమిలి ఎన్నికల బిల్లు రాజ్యంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని.. దీన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ పేర్కొనగా.. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ఈ బిల్లుతో బిడ్ వేస్తున్నారని సమాజ్ వాదీ పార్టీ నేత ధర్మేంద్రయాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.