Begin typing your search above and press return to search.

హైదరాబాద్ జూలో తొక్కి చంపేసిన ఏనుగు.. ఎందుకలా జరిగింది?

అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జూ ఏర్పాటు చేసిన 60 ఏళ్లలో ఎప్పుడూ జరగని దారుణం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   8 Oct 2023 4:41 AM GMT
హైదరాబాద్ జూలో తొక్కి చంపేసిన ఏనుగు.. ఎందుకలా జరిగింది?
X

అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జూ ఏర్పాటు చేసిన 60 ఏళ్లలో ఎప్పుడూ జరగని దారుణం చోటు చేసుకుంది. ఏనుగుల శాలలో సంరక్షకుడిగా పని చేసే 22 ఏళ్ల షాబాజ్ ను ‘విజయ్’ అనే ఏనుగు తొక్కి చంపింది. జూ పార్కు ఏర్పాటై 60 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా శనివారం ఉత్సవాల్ని నిర్వహించారు. తన విధుల్ని పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్లే వేళలో.. తన దుస్తుల్ని తెచ్చుకోవటం కోసం ఏనుగుల శాలకు వెళ్లగా.. తొండంగా షాబాజ్ ను లాగి.. తొక్కి చంపినట్లుగా అధికారులు భావిస్తున్నారు.

జూలో మొత్తం ఒక మగ ఏనుగు.. మూడు ఆడ ఏనుగులు ఉన్నాయి. అందులో విజయ్ 38 ఏళ్ల వయసుతో ఉండగా.. సీతకు 33 ఏళ్లు.. వనజకు 50 ఏళ్లు.. ఆశకు 60 ఏళ్లు. పగటి వేళలో.. వీటిని జూలో స్వేచ్ఛగా వదిలేస్తారు. రాత్రి వేళలో మాత్రం వాటిని గొలుసులతో కట్టేసి ఉంచుతారు. దాదాపు పాతికేళ్ల ముందు తిరుమల తిరుపతి కొండల నుంచి దారి తప్పి పంట పొలాల్లోకి వచ్చిన విజయ్ ను అక్కడి నుంచి హైదరాబాద్ జూకు తీసుకొచ్చారు.

1996లో విజయ్ ను జూకు తీసుకురాగా.. తన వయసున్న ఆడ ఏనుగులు లేకపోవటంతో విజయ్ ఒంటరితనాన్ని అనుభవిస్తోంది. దీంతో.. తనకు కోరిక కలిగిన వేళలో ఏనుగు ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి. ఆ టైంలో తన వద్దకు వచ్చిన వారి పట్ల అనూహ్యంగా ప్రవర్తిస్తోంది. తాజా విషాద ఉదంతంలోనూ అలాంటి వేళలోనే షాబాజ్ వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. షాబాజ్ విషయానికి వస్తే.. అతడి తండ్రి సైతం జూలో మరణించగా.. కారుణ్య నియామకం కింద షాబాజ్ కు ఉద్యోగాన్ని ఇచ్చారు.

శనివారం సాయంత్రం ఏనుగు పెద్దగా అరుస్తూ షాబాజ్ మీద దాడి చేసిందని.. దగ్గర్లోని ఇతర జంతు సంరక్షకులు అప్రమత్తమై.. అక్కడకు వెళ్లేసరికి షాబాజ్ కదల్లేని స్థితిలో ఉన్నారు. వెంటనే బ్యాటరీ వాహనంలో అతడ్ని బయటకు తీసుకొచ్చి.. అంబులెన్సులో డీఆర్ డీవో అపోలో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు. జంతువుల దాడిలో ఉద్యోగి మరణించటం జూ చరిత్రలోనే ఇదే తొలిసారి అని చెబుతున్నారు. విజయ్ కు తోడు మాత్రమే కాదు.. ఇతర జంతువులకు సంబంధించి కూడా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో వారి అవసరాల్ని తీర్చాల్సిన అవసరం ఉంది. విజయ్ దాడి వేళ.. అధికారుల నిర్ణయాలు ఏ రీతిలో ఉంటాయో చూడాలి.