పదకొండో సీటు బీజేపీకి... ఎక్కడ అన్నది సస్పెన్స్...!?
ఇలా పొత్తులో బీజేపీ సీట్లు కొత్త చిచ్చుని రేపుతూంటే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి తాజాగా సంచలన ప్రకటన చేశారు.
By: Tupaki Desk | 29 March 2024 3:44 AM GMTఇప్పటికే బీజేపీకి ఇచ్చిన పది సీట్లలోనూ కావాల్సినంత రాజకీయ రచ్చ సాగుతోంది. బీజేపీకి సీటు ఇచ్చిన ప్రతీ చోటా టీడీపీ రగులుతోంది. కొన్ని చోట్ల జనసేన కూడా వీధిన పడుతోంది. ఇలా పొత్తులో బీజేపీ సీట్లు కొత్త చిచ్చుని రేపుతూంటే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి తాజాగా సంచలన ప్రకటన చేశారు.
పొత్తులో భాగంగా పదకొండో సీటు బీజేపీకి రానుందని ఆమె అంటున్నారు. ఇది పార్టీ అధినాయకత్వం నిర్ణయం అని కూడా ఆమె చెబుతున్నారు ఆ సీటు ఎక్కడ ఇస్తారో తెలియదు కానీ కచ్చితంగా బీజేపీకి సీటు వచ్చి తీరుతుందని ఆమె అంటున్నారు. ఆమె ఈ మాటలు ఎందుకు అన్నారన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.
బీజేపీలో సీట్ల పంపిణీ జరిగాక కొందరు సీనియర్లకు టికెట్ లేకుండా పోయింది. అందులో బీజేపీ ఏపీ మాజీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ముఖ్యుడుగా ఉన్నారు. ఆయనకే సీటు కోత పెట్టారు అన్నది పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దానికి ఏపీ బీజేపీ పెద్దలు కొందరు టీడీపీ ముఖ్యులు కారకులు అని ఆరోపణలు కూడా సీనియర్ల వైపు నుంచి వస్తున్నాయి.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ పదకొండవ సీటు కోరుతోందని అంటున్నారు. ఈ మేరకు టీడీపీ మీద తీవ్ర వత్తిడిని తీసుకుని వస్తోందని అంటున్నారు. మరి టీడీపీకి ఈ పొత్తులతో ఇప్పటికే తల బొప్పి కట్టేసింది. అది చాలదు అన్నట్లుగా పదకొండవ సీటు ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తారు అన్నది కూడా చూడాలి.
ఇక చూస్తే టీడీపీ ఇంకా ప్రకటించాల్సినవి అయిదు సీట్లు మాత్రమే ఉన్నాయి. జనసేన మూడు సీట్లు ప్రకటించాలి. మరి ఈ ఎనిమిదింటిలో ఎవరు సీటుని త్యాగం చేస్తారు అన్నది ప్రశ్నగా ఉంది. పాలకొండ సీటు అవనిగడ్డ, విశాఖ సౌత్ జనసేన అభ్యర్ధులను ప్రకటించకుండా అట్టేబెట్టింది. ఇందులో ఒక దాన్ని బీజేపీకి ఇస్తారా అన్నది చూడాలి.
అదే విధంగా భీమిలీ, చీపురుపల్లితో పాటు మరో మూడు సీట్లు టీడీపీ చేతిలో ఉన్నాయి. వాటిలో ఇస్తారా అన్నది చూడాలి. అయితే సోము వీర్రాజుకు కనుక ప్లేస్ మెంట్ ఇవ్వాలనుకుంటే అది రాజమండ్రి అర్బన్ లేదా రూరల్ అసెంబ్లీ సీట్లలో మాత్రమే అని అంటున్నారు. అవి ఖాళీగా అయితే లేవు. మరి పదకొండవ సీటు సోము వీర్రాజుకు కాకపోతే సీనియర్లలో పీవీఎన్ మాధవ్ లేదా విష్ణు వర్ధన్ రెడ్డిలలో ఒకరికి అయినా ఇచ్చేలా చూస్తారా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఈ పదకొండవ సీటు కాదు కానీ మరో ఫైటింగ్ ఎపిసోడ్ ని చూసేందుకు కూటమి పెద్దలు రెడీగా ఉండాలని అంటున్నారు.