Begin typing your search above and press return to search.

ఎలాన్ మస్క్.. అమెరికాలో ఇల్లీగల్ గా ఉన్నాడా?

ఈ నేపథ్యంలో... ఎలాన్ మస్క్ కి సంబంధించిన పలు విషయాలు తెరపైకి వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   27 Oct 2024 7:30 PM GMT
ఎలాన్  మస్క్.. అమెరికాలో ఇల్లీగల్  గా ఉన్నాడా?
X

ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుదు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా నిలిచారు. ఈ సమయంలో అభ్యర్థులు కమలా హారిస్, ట్రంప్ లకు ఏమాత్రం తగ్గకుండా అన్నట్లుగా ఎలాన్ మస్క్ కూడా మీడియాలో నానుతూనే ఉన్నారు!

ట్రంప్ కు మద్దతుగా నిలిచి ప్రచారం చేయడమే కాకుండా.. వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు ఎలాన్ మస్క్ అని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలో... ఎలాన్ మస్క్ కి సంబంధించిన పలు విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... ఎలాన్ మస్క్ వర్క్ పర్మిట్ లేకుండానే అగ్రరాజ్యం అమెరికాలో పనిచేసినట్లు కథనాలొస్తున్నాయి.

అవును... ఎలాన్ మస్క్ కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... మస్క్ కొంతకాలం అమెరికాలో వర్క్ పర్మిట్ లేకుండా పని చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ కథనంలో వెల్లడించింది. ఇప్పుడు ఈ కథనం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై కామెంట్ సెక్షన్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ కథనం ప్రకారం... దక్షిణాఫ్రికాకు చెందిన ఎలాన్ మస్క్ 1995లో కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోకి వచ్చారు. ఈ సమయంలో ఆయన ఏ యూనివర్సిటీలో నమోదు చేసుకోకుండా జిప్2 అనే సాఫ్ట్ వేర్ కంపెనీని అభివృద్ధి చేశారు. ఈ క్రమంలో 1999లో ఆ కంపెనీని సుమారు $300 మిలియన్లకు విక్రయించారు.

వాస్తవానికి ఓ వ్యక్తి అమెరికా వర్క్ పర్మిట్ పొందాలంటే ఆ వ్యక్తి గ్రాడ్యుయేషన్ కోర్సులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే... అలా చేయకుండానే కొంతకాలం ఉన్నట్లు ఆ నివేదికలో వెల్లడించింది. 1997లో మస్క్ వర్క్ పర్మిట్ పొందినట్లు ఆయన మాజీ సహచరులు వెల్లడించినట్లు తెలుస్తోంది.

అయితే... ఈ ఆరోపణలపై మస్క్ ఇంకా స్పందించలేదు. కాగా.. నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ కు మస్క్ మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... అక్రమ వలసదారులపై కఠిన వ్యాఖ్యలు చేశారు. కట్ చేస్తే... వర్క్ పర్మిట్ లేకుండా పనిచేసినట్లు మస్క్ పై కథనాలు రావడం గమనర్హం.