Begin typing your search above and press return to search.

మాస్కోతో మస్క్ సంబంధాలు... అమెరికా భద్రత ప్రమాదంలో ఉందా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Nov 2024 3:33 AM GMT
మాస్కోతో మస్క్ సంబంధాలు... అమెరికా భద్రత ప్రమాదంలో ఉందా?
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే... ఈ విజయంలో ఎలన్ మస్క్ పాత్ర చాలా కీలకం అనే చెప్పాలి. ట్రంప్ కోసం మస్క్ తెరపై కంటే తెర వెనుక ఎక్కువ కష్టపడ్డారని, ఎంతో కృషి చేశారని అంటున్నారు. ఈ సమయంలో ట్రంప్ కూడా ఆ మేరకు కృతజ్ఞత కలిగి ఉన్నారు!

ఈ మేరకు ఇప్పటికే మస్క్ కు ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా... మస్క్ తో పాటు వివేక్ రామస్వామిని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా నియమించారు. ఆ సంగతి అలా ఉంటే... మరోవైపు ఎలన్ మస్క్ పై డెమోక్రాట్లు కీలక ఆరోపణలు తెరపైకి తెచ్చారు. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.

అవును... ఎలాన్ మస్క్ పై డెమోక్రాటిక్ నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో మస్క్ కు ఉన్న బంధంపై సమీక్ష చేపట్టాలని డెమోక్రటిక్ సెనేటర్లు జీన్ షాహిన్, జాక్ రీడ్ జస్టిస్ డిపార్ట్ మెంట్, పెంటగాన్ సంస్థలకు లేఖలు రాశారు. ఈ ఇద్దరూ ఆర్మ్ డ్ సర్వీసెస్ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో... ప్రభుత్వాన్నికీ స్పేస్ ఎక్స్ కు మధ్య జరిగిన ఒప్పందాలపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఈ వ్యవహారంపైనా, ఆయన విశ్వసనీయతపైనా తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోందని వారు లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికా భద్రత ప్రమాదంలో పడే అవకాశాలనే విషయాన్ని తెరపైకి తెచ్చారు.

వాస్తవానికి గత నెలలో వాల్ స్ట్రీట్ జర్నల్ రష్యాతో మస్క్ కు ఉన్న సంబంధాలపై కథనాలు ప్రచురించింది. అప్పటి నుంచి చాలా మంది డెమోక్రటిక్ నేతలు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని బహిరంగంగానే కోరుతున్నారు. అయితే... అధికారికంగా అధికారులకు లేఖ రాయాడం మాత్రం ఇదే తొలిసారి.

దీంతో... మాస్కోతో మస్క్ సంబంధాలపై సందేహాలు అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే... ఈ ఆరోపణలపై ఇటు స్పేస్ ఎక్స్ గానీ, అటు పెంటగాన్ కానీ స్పందించలేదు!