Begin typing your search above and press return to search.

కేంద్రంపై దావా... తొండముదిరి మస్క్ ‘ఎక్స్’ అయ్యిందా?

ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) కేంద్ర ప్రభుత్వంపై దావా వేసింది.

By:  Tupaki Desk   |   21 March 2025 12:00 AM IST
కేంద్రంపై దావా... తొండముదిరి మస్క్ ‘ఎక్స్’ అయ్యిందా?
X

ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) కేంద్ర ప్రభుత్వంపై దావా వేసింది. ఈ మేరకు కర్ణాటక ఉన్నత న్యాయస్థానంలో 'ఎక్స్' సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. భారత ప్రభుత్వం ఏకపక్షంగా సెన్సార్ షిప్ చేస్తోందని.. చట్టవిరుద్ధంగా కంటెంట్ ను నియంత్రిస్తోందని ఆరోపణలు చేసింది.

అవును... భారత ప్రభుత్వంపై మస్క్ ఎక్స్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో భాగంగా... ఐటీ చట్టంలోని 79(3)(బి)ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. ఐటీ చట్టంలోని నిబంధనలు తమకున్న చట్టబద్ధమైన రక్షణలను ఉల్లంఘించేలా ఉన్నాయని.. తమపై అనధికారికంగా సెన్సార్ చేయడం కిందికే ఇది వస్తుందని తన పిటిషన్ లో పేర్కొంది.

ఇదే సమయంలో... ఐటీ చట్టం ప్రకారం కేంద్రం బ్లాక్ చేసిన కంటెంట్ ను తొలగించకపొతే, తన చట్టబద్ధమైన రక్షణను ఎక్స్ కోల్పోయే అవకాశం ఉంటుందని తెలిపింది. అయితే... ఈ సెక్షన్ కింద కంటెంట్ ను బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఇవ్వలేదని ఎక్స్ చెబుతోంది! సెక్షన్ 69ఏ ని పక్కదారి పట్టించడానికి అధికారులు నిబంధనలు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది!

వాస్తవానికి దేశంలో అల్లర్లు, శాంతికి విఘాతం ఘటనలు జరగడానికి కారణమయ్యే పోస్టులు, అవి సృష్టించిన ఖాతాలపై నియంత్రణ విధించేందుకు సెక్షన్ 69ఏ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. అయితే.. సెక్షన్ 79(3)(బి) స్పష్టమైన తనిఖీలు లేకుండా కంటెంట్ ను బ్లాక్ చేయడానికి అధికారులకు అనుమతిస్తున్నారని తన పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో... సహయోగ్ పోర్టల్ లో చేరడానికి కేంద్రం ఒత్తిడి చేస్తోందని చెబుతూ.. దాన్ని ఎక్స్ వ్యతిరేకిస్తోందని అంటున్నారు. అదే విధంగా సహయోగ్ ను సెన్సార్ షిప్ పోర్టల్ గా ఎక్స్ అభివర్ణిస్తోంది.. ఈ మేరకు కంపెనీలపై ఒత్తిడి తీసుకురావడానికి ఎటువంటి చట్టపరమైన ఆధారం లేదని పిటిషన్ లో పేర్కొన్నట్లు చెబుతున్నారు!

అయితే.. ఈ దావాపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు నుంచి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ప్రభుత్వం అనేది చట్టాన్ని అనుసరించి ముందుకెళ్తుందని.. సోషల్ మీడియా సంస్థలు ఏవైనా సరే నిబంధనలు పాటించాల్సిందేనని ఆ వర్గాలు పేర్కొన్నాయని అంటున్నారు.