Begin typing your search above and press return to search.

ఎలాన్ మస్క్ టెస్లాకు నిరసన సెగ.. కారణం క్లియర్!

ప్రధానంగా.. వృథా ఖర్చులను తగ్గించడంతో పాటు ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పులు తీసుకురావడమే దీని లక్ష్యంగా ఫిక్స్ చేశారు!

By:  Tupaki Desk   |   2 March 2025 7:00 PM IST
ఎలాన్  మస్క్  టెస్లాకు  నిరసన సెగ.. కారణం క్లియర్!
X

గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు అనంతరం డొనాల్డ్ ట్రంప్ ఓ ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందులో భాగంగా... డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డొజ్) ను ఏర్పాటు చేశారు. ప్రధానంగా.. వృథా ఖర్చులను తగ్గించడంతో పాటు ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పులు తీసుకురావడమే దీని లక్ష్యంగా ఫిక్స్ చేశారు!

దీని బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు అప్పగించారు. నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాన్ మస్క్ అతిపెద్ద సమస్యగా మారారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 2 వేల మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై వేటు వేశారు. మిగిలిన ఉద్యోగులకు బలవంతపు సెలవులు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఈ ఎఫెక్ట్ టెస్లాకు తగిలింది!

అవును... ఉద్యోగులంతా గతవారం ప్రభుత్వం కోసం ఏమి పని చేశారో వివరించాలని.. అలా చేయలేని పక్షంలో వారు తమ తమ పదవులకు రాజీనామా ఇవ్వాలని ఇటీవల ఎలాన్ మస్క్ అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు మస్క్ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారని అంటున్నారు. దీంతో.. టెస్లా ముందు నిరసనలు మొదలయ్యాయి.

ఇందులో భాగంగా... అమెరికా అంతటా టెస్లా డీలర్ షిప్ ల ముందు నిరసనలు చెలరేగాయి. ఆ సంస్థ సీఈవో ఎలాన్ మస్క్ ను లక్ష్యంగా చేసుకుని, డోజ్ ను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్నారు. ట్రంప్ తో కలిసి మస్క్ ‘డొజ్’ పేరు చెప్పి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెబుతూ.. ఉద్యమానికి తెరలేపారు.

మస్క్ రాజకీయ ప్రమేయానికి వ్యతిరేకంగా ఈ నిరసనలు మొదలయ్యాయి. మస్క్ నిర్ణయాలు కాంగ్రెస్ అధికారాన్ని బలహీనపరుస్తుందని.. అతని వ్యక్తిగత వ్యాపారాలకు మాత్రం ప్రయోజనాలు చేకూరుస్తుందని చెబుతున్నారు. ఈ సందర్భంగా... బోస్టన్, న్యూయార్క్, కాలిఫోర్నియాలోని వివిధ నగరాల్లో నిరసనలు చెలరేగాయి!

ఈ సందర్భంగా... టెస్లా ఉత్పత్తులను బహిష్కరించాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. ఈ ఎలక్ట్రి క్ కార్ల దిగ్గజ వాహనాలను కొనుగోలు చేయకుండా ఉండాలని వారు కోరుతున్నారు. దీంతో... ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. డోజ్ పనులు మస్క్ కు రాజకీయంగానే కాకుండా వ్యాపార పరంగానూ సమస్యగా మారుతున్నట్లున్నాయని అంటున్నారు!

కాగా... వివాదాలు ఉన్నప్పటికీ, వ్యతిరేకత పెరుగుతున్నట్లు చెబుతున్నప్పటికీ ఎలాన్ మస్క్ నికర విలువ మాత్రం పెరుగుతూనే ఉంది. ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ టెస్లా స్టాక్ తగ్గినట్లు చెబుతున్నప్పటికీ.. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ కుబేరుల జాబితాలో $351 బిలియన్ డాలర్స్ తో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు.