ప్రభుత్వ ఉద్యోగులకు మస్క్ మార్కు వార్నింగ్ పీక్స్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2.0లో కీలకంగా వ్యవహరిస్తోన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ప్రభుత్వ ఉద్యోగులకు తాజాగా ఓ భారీ షాకిచ్చాడు.
By: Tupaki Desk | 23 Feb 2025 4:30 PM GMTవార్నింగులందు ఎలాన్ మస్క్ వార్నింగ్ వేరయా అన్నట్లుగా ఉంది తాజాగా తెరపైకి వచ్చిన ఓ వ్యవహారం. ఇందులో భాగంగా... ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న డోజ్ అధినేత మస్క్.. తాజాగా అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు ఓ భారీ షాక్ ఇచ్చారు. ఈ మేరకు ఓపీఎం నుంచి ఈ మెయిల్ పంపారు. ఇది వైరల్ గా మారింది.
అవును... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2.0లో కీలకంగా వ్యవహరిస్తోన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ప్రభుత్వ ఉద్యోగులకు తాజాగా ఓ భారీ షాకిచ్చాడు. ఇందులో భాగంగా... ఫెడరల్ ఉద్యోగులకు యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్ మెంట్ (ఓపీఎం) నుంచి ఓ మెయిల్ పంపారు. అందులో ఉద్యోగులకు తనదైన శైలిలో టాస్క్ ఇచ్చారు.
ఇందులో భాగంగా.. ఉద్యోగులంతా గతవారం ప్రభుత్వం కోసం ఏమి పని చేశారో వివరించాలని కోరారు. అలా చేయలేని పక్షంలో వారు తమ తమ పదవులకు రాజీనామా ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి 11:59 గంటల్లోపు కేవలం ఐదు వాక్యాల్లో ఉద్యోగులు రిప్లై ఇవ్వాలని ఆదేశించారు.
అయితే తాజా నిర్ణయంపై యూఎస్ కు చెందిన అతిపెద్ద ఉద్యోగ సంఘం "అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్" జాతీయ అధ్యక్షుడు ఎవెరెట్ కెల్లీ స్పందించారు. ఈ సందర్భంగా... ట్రంప్ తీసుకుంటున్న చర్యలు ఫెడరల్ ఉద్యోగుల పట్ల, దేశ ప్రజలకు అందించే క్లిష్టమైన సేవల పట్ల ఆయనకు ఉన్న అయిష్టతను సూచిస్తున్నాయని అన్నారు.
ఇదే సమయంలో... చట్టవిరుద్ధమైన తొలగింపులకు పాల్పడితే వాటిని సవాలు చేస్తామని పేర్కొన్న కెల్లీ... తన జీవితంలో ఒక్కసారి కూడా నిజాయితీగా ప్రజసేవ చేయని మస్క్ తో తమ ఉద్యోగులకు విధుల గురించి చెప్పించడం అంటే.. అది వారిని అగౌరవపరచడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వచ్చిన మెయిల్ కు ప్రతిస్పందించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
దీంతో... ఈ వ్యవహారంలో "అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్" ఉద్యోగ సంఘం నేతలు తీసుకున్న నిర్ణయమపై డోజ్ సారథి ఎలాన్ మస్క్, ప్రెసిడెంట్ ట్రంప్ లు ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. కాగా... ఇటీవల డోజ్ డిపార్ట్ మెంట్ కు ప్రత్యేక అధికారాలిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేసిన సంగతి తెలిసిందే!