Begin typing your search above and press return to search.

మళ్లీ పేలిన స్టార్ షిప్.. మస్క్ కు అస్సలు కలిసి రావట్లేదుగా!

లక్షల కోట్ల రూపాయిలు చేతిలో ఉన్నప్పుడు.. తాను కోరుకున్న రంగాల్లో తనదే పైచేయిగా ఉండాలని ఆశ పడటం సహజం.

By:  Tupaki Desk   |   7 March 2025 11:37 AM IST
మళ్లీ పేలిన స్టార్ షిప్.. మస్క్ కు అస్సలు కలిసి రావట్లేదుగా!
X

లక్షల కోట్ల రూపాయిలు చేతిలో ఉన్నప్పుడు.. తాను కోరుకున్న రంగాల్లో తనదే పైచేయిగా ఉండాలని ఆశ పడటం సహజం. అయితే.. అన్నింట్లో తాను అనుకున్నట్లు ముందుకు వెళుతున్నప్పటికి అంతరిక్ష ప్రయోగాల్లో మాత్రం దెబ్బ మీద దెబ్బ పడుతోంది ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు. అంతరిక్ష రంగం మీద పట్టు సాధించాలని భావిస్తున్న ఆయన.. ఇప్పటికే ఆ రంగంలో కొన్ని విజయాల్ని నమోదు చేశారు. అదే సమయంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

తాజాగా అలాంటి ఎదురుదెబ్బ మరొకటి ఎదురైంది. ఆయనకు చెందిన స్పేస్ ఎక్స్ ప్రయోగించిన స్టార్ షిప్ మెగా రాకెట్ ప్రయోగం ఫెయిల్ అయ్యింది. గత జనవరిలో ఇదే తరహాలో ప్రయోగించిన ప్రయోగం ఫెయిల్ కావటం.. దానిపై మస్కే స్వయంగా వీడియోను షేర్ చేయటం తెలిసిందే. తాజాగా టెక్సాస్ లోని బొకాచికా వేదికగా సాయంత్రం ఐదున్నర గంటల వేళలో రాకెట్ ప్రయోగం జరిగింది.

ఈ రాకెట్ మొదట విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లినా.. అంతరిక్షంలో అది పేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆకాశంలో దీపావళి మాదిరి మస్క్ కు చెందిన రాకెట్ పేలిపోవటంతో భారీగా నిప్పు శకలాలు అందరూ చూస్తుండిపోయేలా చేశాయి. తాజాగా నిర్వహించిన రాకెట్ ప్రయోగం ఫెయిల్ కావటంపై స్పేస్ ఎక్స్ స్పందించింది.

403 అడుగుల పొడవు ఉన్న ఈ రాకెట్ సూర్యాస్తమయానికి ముందు టెక్సాస్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. మొదటి దశలో స్పేస్ ఎక్స్ విజయవంతంగా టేకాఫ్ అయ్యింది.కానీ.. అంతరిక్ష నౌకకు ముందుగా నిర్ణయించిన మార్గంలో ముందుకు వెళ్లలేదు. దీంతో నియంత్రణ కోల్పోయింది. ఈ ప్రయోగాన్ని లైవ్ స్ట్రీమ్ లో ప్రదర్శించారు. అందులో స్టార్ షిప్ అదుపు తప్పి తిరిగిన వైనం కనిపించింది. ఆ తర్వాత సంబంధాల్ని కోల్పోయింది. కాసేపటికే పేలిపోయింది.

ఈ ఎదురుదెబ్బల నుంచి తాము పాఠాలు నేర్చుకుంటున్నట్లుగా వెల్లడించింది. రాకెట్ పేలిపోవటంతో దాని నుంచి భారీగా శకలాలు భూమి మీదకు దూసుకొచ్చాయి. దక్షిణ ఫ్లోరిడా.. బహమాస్ దీవుల్లో ఈ శకలాలు పడ్డాయి. జనావాసాల్లో శకలాలు పడినప్పటికి ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఈ నేపథ్యంలో ఎయిర్ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రయోగం ఫెయిల్ అయి.. శకలాలు భూమి మీదకు వచ్చి పడిన నేపథ్యలో మయామి..ఫోర్ట్ లాడర్ డేల్.. పామ్ బీచ్.. ఓర్లాండ్ ఎయిర్ పోర్టుల్లో విమానాల్ని తాత్కాలికంగా నిలిపేశారు. జనవరిలోనూ స్పేస్ ఎక్స్ నిర్వహించిన భారీ రాకెట్ ఫెయిల్ కావటం.. అది కూడా ఆకాశంలో పేలిపోయింది. దీని శకలాలు కరేబియన్ సముద్రంలో పడ్డాయి. అయితే.. బూస్టర్ క్షేమంగా లాంచ్ పాడ్ పైకి చేరిన సంగతి తెలిసిందే. రెండు నెలల వ్యవధిలో రెండోసారి రాకెట్ ప్రయోగం విఫలం కావటం మస్క్ కు ఎదురుదెబ్బగా చెబుతున్నారు.