Begin typing your search above and press return to search.

55.8 బి. డాలర్లు.. 350 బి. డాలర్లు..మస్క్ కు షాక్..రికార్డు కిక్

ఇప్పుడు ఆయనకు సంబంధించి రెండు ఇంట్రస్టింగ్ అప్ డేట్స్ బయటకు వచ్చాయి. ఒకటి మస్క్ కు మళ్లీ షాక్ లాంటి వార్త కాగా.. మరొకటి.. ఆయనను రికార్డు స్థాయిలో నిలిపిన వార్త

By:  Tupaki Desk   |   3 Dec 2024 11:30 AM GMT
55.8 బి. డాలర్లు.. 350 బి. డాలర్లు..మస్క్ కు షాక్..రికార్డు కిక్
X

అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కు సంబంధించి ఏ చిన్న వార్త అయినా సంచలనమే.. ఆయన రూ.3.50 లక్షల కోట్లు పెట్టి ట్విటర్ ను కొని.. దాని పేరును ఎక్స్ గా మార్చినా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నకు గట్టిగా మద్దతు పలికినా..ఏంచేసినా అది కథనమే. ఇప్పుడు ఆయనకు సంబంధించి రెండు ఇంట్రస్టింగ్ అప్ డేట్స్ బయటకు వచ్చాయి. ఒకటి మస్క్ కు మళ్లీ షాక్ లాంటి వార్త కాగా.. మరొకటి.. ఆయనను రికార్డు స్థాయిలో నిలిపిన వార్త.

ఆరేళ్ల కిందటే ఏడాదికి రూ.4.5 లక్షల కోట్లు

మస్క్ అంటే అపర కుబేరుడు. ఇక ఆయన సంస్థల నుంచి పొందే వేతనం ఎంతుంటుంది? మస్క్‌ 2018లో అన్నిప్రయోజనాలు కలిపి 55.8 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) వార్షిక వేతనం అందుకున్నారు. అప్పటికీ, ఇప్పటికీ కార్పొరేట్‌ చరిత్రలో ఇదే అత్యధికం. దీంతో ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలిచారు. కానీ, ఇంత అధికంగా చెల్లింపులు ఏంటంటూ వాటాదారు రిచర్డ్ టోర్నెట్టా.. డెలవేర్ కోర్టును ఆశ్రయించారు. ఇది కార్పొరేట్ ఆస్తులను వృథా చేయడమే అని పిటిషన్‌ లో పేర్కొన్నారు. కంపెనీ డైరెక్టర్లపై మస్క్‌ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆయనకు నచ్చిన ప్యాకేజీని ఆమోదించాలని హుకుం జారీ చేస్తున్నారని ఆరోపించారు. ఇది తమ స్వతంత్రకు ఇబ్బందిగా మారిందన్నారు.

ఔను.. వాటాదార్లకు అన్యాయమే..

టోర్నెట్టా పిటిషన్ పై కోర్టు తాజాగా తీర్పు చెబుతూ మస్క్ కు అంత ప్యాకేజీ ఇస్తే వాటాదారులకు అన్యాయం చేసినట్లేనని పేర్కొంది. గతంలో మస్క్‌ కు 55.8 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీని తిరస్కరిస్తూ తాము ఇచ్చిన తీర్పును సమర్థించుకుంది. షేర్‌హోల్డర్‌ ఓట్ల ద్వారా డీల్‌ ను ముందుకుతీసుకెళ్లాలని టెస్లా చేసిన ప్రయత్నాన్ని తిరస్కరించింది. మస్క్‌ మాత్రం తనదైన శైలిలో స్పందిస్తూ ‘కంపెనీ ఓట్లపై నియంత్రణ వాటాదారులకే ఉండాలి. జడ్జిలకు కాదు’’ అని ట్వీట్ చేశారు.

అక్కడ ఎదురుదెబ్బ.. ఇక్కడ పైచేయి..

అటు కోర్టులో ఎదురుదెబ్బ తగిలిన సమయంలోనే మస్క్ రికార్డు నెలకొల్పారు.. ఆయన సంపద ఇప్పుడు 350 బిలియన్ డాలర్లు దాటింది. ఒక బిలియనీర్ ఈ దశకు చేరడం ఇదే తొలిసారి. మస్క్ సంపదలో 10 బిలియన్ డాలర్ల పైగా పెరుగుదల నమోదైంది. ప్రస్తుత సంవత్సరంలో నికర విలువ 124 బిలియన్ డాలర్లు పెరిగింది. మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత మస్క్ సంపద నికర విలువ వేగంగా విస్తరించింది. అది ఎంతగా నంటే.. 89 బిలియన్ డాలర్లు. ట్రంప్ గెలిచిన నవంబరు 4 నుంచి మస్క్ సంస్థ టెస్లా షేర్లు 47 శాతానికి పైగా పెరిగాయి.

ఏడాదిలో 400 బిలియన్ డాలర్లకు..

కాగా, 300 బిలియన్ డాలర్ల మార్కును దాటిన ఏకైక వ్యక్తి కూడా మస్క్ కావడం విశేషం. మూడేళ్ల కిందట 2021లో ఆయన ఈ ఘనత సాధించారు. ఇదే జోరుతో ఉంటే.. ఏడాదిలో మస్క్ సంపద 400 బిలియన్ డాలర్లకు చేరొచ్చని నిపుణులు భావిస్తున్నారు

ఒక్క సోమవారమే మస్క్ మొత్తం సంపదలో 10.3 బిలియన్ డాలర్లు లేదా 4.3 శాతం పెరుగుదల కనిపించింది. ప్రస్తుత సంవత్సరంలో మొత్తం నికర విలువ 124 బిలియన్ డాలర్లు అంటే 54 శాతానికి పైగా పెరిగింది.