మస్క్ కు 'ట్రంప్ కార్డ్'... సంపద ఎన్ని లక్షల కోట్లు పెరిగిందో తెలుసా?
ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యేవరకూ ఆయన వెనకే ఉంటానంటూ ప్రకటించి మరీ చివరి వరకూ తన ప్రయత్నాన్ని కొనసాగించారు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.
By: Tupaki Desk | 7 Nov 2024 7:40 AM GMTతాజాగా ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ లకు ఏమాత్రం తగ్గకుండా మారుమోగిన పేరు.. ఎలాన్ మస్క్ అని చెప్పినా అతిశయోక్తి కాదు. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యేవరకూ ఆయన వెనకే ఉంటానంటూ ప్రకటించి మరీ చివరి వరకూ తన ప్రయత్నాన్ని కొనసాగించారు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.
ట్రంప్ కోసం ప్రచారం చేయడంతో పాటు ఓటర్లను ఆకర్షించే క్రమంలో వారం వారం లాటరీలంటూ భారీ నగదు ఖర్చు చేశారు. ట్రంప్ ప్రచార కార్యక్రమాలకు మస్క్ కొన్ని వందల కోట్లు ఖర్చు చేశారని చెబుతున్నారు. ఇక ఎక్స్ లో ట్రంప్ ప్రచారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన మస్క్... డెమోక్రాట్ల ప్రచారాన్ని ఎక్స్ లో అడ్డుకోవడంలో వ్యూహాత్మకంగా ముందుకు కదిలినట్లు చెబుతారు.
మరోపక్క తన గెలుపు సంబరాల్లో భాగంగా మస్క్ ను తలచుకుని, ప్రశంసల జల్లులు కురిపించారు ట్రంప్. ఇందులో భాగంగా... ఒక స్టార్ ఉంది.. అతను ఓ మేధావి.. అతను అద్భుతమైన వ్యక్తి.. తన సంస్థ స్పేస్ ఎక్స్ ప్రయత్నాలతో అమెరికా అంతరిక్ష రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అతని కృషి అభినందనీయం.. ఆయన మేలు మరిచిపోలేను అంటూ కామెంట్ చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయంతో ఎలాన్ మస్క్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సందర్భంగా నింగిలోని దూసుకెళ్తున్న రాకెట్ ఫోటో షేర్ చేసిన ఆయన... "భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది" అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఆ సంగతులు అలా ఉంటే... డొనాల్డ్ ట్రంప్ గెలుపు వేళ మస్క్ సంపద భారీగా పెరిగింది.
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయ సాధించిన వేళ.. ఎలాన్ మస్క్ సంపద భారీగా పెరిగింది. ఇందులో భాగంగా... 26.5 బిలియన్ డాలర్లు (సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు) మేర పెరిగిందని అంటున్నారు. దీంతో... ప్రపంచ కుబేరుల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న మస్క్ నికర సంపద 290 బిలియన్ డాలర్లకు చేరింది.
ఈ మేరకు బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తాజాగా వెల్లడించింది. ట్రంప్ గెలుపు ఫలితం మస్క్ సంస్థల షేర్లపై సానుకూల ప్రభావాన్ని చూపడం భారీగా లాభించిందని చెబుతున్నారు. ఇదే సమయంలో... అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద కూడా 7.14 బిలియన్ డాలర్లు (సుమారు రూ.60 వేల కోట్లు) పెరిగిందని అంటున్నారు.