ఎలాన్ మస్క్ మరో రచ్చ స్టార్ట్!
ఎలాన్ మస్క్ లాంటోడు ఒక పోస్టును పెడితే ఎవరు ఊరికే ఉంటారు చెప్పండి.
By: Tupaki Desk | 30 July 2024 5:04 AM GMTఊరికే ఉంటే ఆయన్ను ఎలాన్ మాస్క్ ఎందుకని అంటారు. ప్రపంచ కుబేరుడిగా ఉండి కూడా.. ఏదో ఒక విషయాన్ని కెలికటంలో ఆయనకున్న ఆసక్తి అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన.. ఎప్పుడు ఏరీతిలో రియాక్టు అవుతారన్నది అంచనాలకు అతీతంగా ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి ఎంతలా ఉందన్న విషయం తెలిసిందే. ఇలాంటివేళ.. దిగ్గజ సెర్చింజన్ కు కొత్త తలనొప్పి తెచ్చి పెట్టాడు. తన తీరుతో గూగుల్ ఇరుకునపడేలా చేయటమే కాదు.. కొత్త సందేహాలకు తెర తీశారు.
ఇంతకూ ఆయనేం చేశారంటే.. గూగుల్ లో ప్రెసిడెంట్ డొనాల్డ్ అని టైప్ చేయగా.. దానికి సజెషన్స్ లో ‘ప్రెసిడెంట్ డొనాల్డ్ డక్.. ప్రెసిడెంట్ డొనాల్డ్ రీగన్’ లాంటి పేర్లు కనిపించాయి. వీటి స్క్రీన్ షాట్లు తీసి.. తన ఎక్స్ వేదిక మీద షేర్ చేశాడు. వావ్.. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీద గూగుల్ నిషేధం విధించిందా? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గూగుల్ ఏమైనా జోక్యం చేసుకుంటుందా?’’ అన్న తన సందేహాల్ని వ్యక్తం చేశారు.
ఎలాన్ మస్క్ లాంటోడు ఒక పోస్టును పెడితే ఎవరు ఊరికే ఉంటారు చెప్పండి. అతగాడి పనికి ఒక నెటిజన్ స్పందిస్తూ.. గూగుల్ సంస్థ డెమోక్రాట్ల అధీనంలో ఉందని కామెంట్ చేశాడు. దీనికి స్పందించిన మస్క్ బదులిస్తూ.. ఎన్నికల్లో వాళ్లు జోక్యం చేసుకుంటే.. తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంటారని బదులిచ్చాడు. మొత్తంగా కొత్త రచ్చకు తెర తీశాడు. మస్క్ తీరును తప్పు పట్టినోళ్లు లేకపోలేదు. ఎక్స్ లో ఎలాన్ మస్క్ కు నచ్చని ఖాతాలపై నిషేధం విధించారన్న అంశాన్ని పేర్కొంటూ.. అలాంటప్పుడు మీకు.. గూగుల్ కు తేడా ఏముంది? అని ప్రశ్నించారు. ఈ ఎపిసోడ్ మీద గూగుల్ ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.