Begin typing your search above and press return to search.

భారత్ విషయంలో భద్రతా మండలిని ఆక్షేపించిన మస్క్!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భారత్ అత్యంత కీలక దేశంగా మారుతుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 Jan 2024 2:30 PM GMT
భారత్  విషయంలో భద్రతా మండలిని ఆక్షేపించిన మస్క్!
X

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భారత్ అత్యంత కీలక దేశంగా మారుతుందని అంటున్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న భారత్.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషించబోతుందని చెబుతున్నారు. ఈ సమయంలో ఐక్యరాజ్యసమితి పని తీరుపై స్పందిస్తూ... భారత్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌. ఇందులో భాగంగా... భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని ఆయన ఆక్షేపించారు!

అవును... తాజాగా ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థల పని తీరుపై స్పందించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఐక్యరాజ్యసమితి తో పాటు దాని అనుబంధ సంస్థల్లోనూ మార్పులు చేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఈ సందర్భంగా భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

వివరాళ్లోకి వెళ్తే... ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఇటీవల ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ... భద్రతా మండలిలో ఏ ఒక్క ఆఫ్రికా దేశానికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 80ఏళ్ల కిందటిలాగానే ఇప్పటికీ పరిస్థితి ఉందని అన్నారు. ఇది సరైంది కాదని, అలా జరగకూడదని అభిప్రాయపడ్డారు. దీంతో భద్రతా మండలిలో దేశాల శాశ్వత సభ్యత్వంపై చర్చ మొదలైంది.

ఇలా ఆంటోనియో గుటెరస్ పోస్ట్ పై స్పందించిన అమెరికాకు చెందిన వ్యాపారి మైఖెల్ ఐసెస్ బర్డ్... మరి భారత్ సంగతి ఏంటి అని ప్రశ్నించారు. దీంతో... ఈ ప్రశ్నకు సమాధానంగా మస్క్ రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా... ఐరాస, అనుబంధ సంస్థలను సవరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ సమయంలో... ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం దారుణమని అన్నారు.

కాగా... ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా 1945 లో "ఐక్యరాజ్యసమితి" ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అనంతరం దానికి అనుబంధంగా "భద్రతా మండలి" ఏర్పడింది. ఇలా ఈ సంస్థ ఏర్పడి ఏడున్నర దశాబ్ధాలు అవుతున్నప్పటికీ... ఇప్పటి వరకు భద్రతా మండలిలో ఎలాంటి మార్పులూ జరగలేదు. ఈ నేపథ్యంలో... భారత్ కు, దానితోపాటు ఆఫ్రికా యూనియన్‌ కు శాస్వత సభ్యత్వం ఇవ్వాలని మస్క్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఇక... వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశాలుగా నాటి నుంచీ అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్‌, చైనా దేశాలే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ప్రయత్నిస్తున్న సమయంలో... ఐదింట నాలుగు దేశాలు భారత్‌ కు అనుకూలంగానే ఉన్నప్పటికి.. ఒక్క చైనా మాత్రం ఈ విషయంలో అడ్డు తగులుతుంది. ఈ సమయంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్ కు భద్రతా మండలిలో శాస్వత సభ్యత్వం లేకపోవడాన్ని మస్క్ ఆక్షేపించారు!