ఎలాన్ మస్క్ ఒక్క నిమిషం సంపాదన ఎంతో తెలుసా?
సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో నెలకు లక్ష రూపాయల జీతం సంపాదించే వ్యక్తిని బందువులు, స్నేహితులు అంతెత్తున చూస్తుంటారు
By: Tupaki Desk | 16 Feb 2024 11:30 AM GMTసాధారణంగా కొన్ని ప్రాంతాల్లో నెలకు లక్ష రూపాయల జీతం సంపాదించే వ్యక్తిని బందువులు, స్నేహితులు అంతెత్తున చూస్తుంటారు. ఇక ఒక నెలలో కోటి రూపాయలు సంపాదించే వ్యక్తిని సంపన్నుడిగా, అత్యంత సక్సెస్ ఫుల్ పర్సన్ గా పరిగణిస్తారు. మరి ఒక గంటలో కోట్లు సంపాదించే వ్యక్తిని ఏమనాలి? అలాంటి వ్యక్తి ఉంటారని ఎవరైనా ఉహిస్తారా? కానీ అలాంటి వ్యక్తులులు ఉన్నారు. వారిలో టాప్ ప్లేస్ లో ఉన్నాడు ఎలాన్ మస్క్.
అవును... స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ గంటలో కోట్లు సంపాదించించే అసాధారణ వ్యక్తిగా నిలిచారు! ప్రస్తుతానికి $198.9 బిలియన్ల నికర సంపదతో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో రెండో ప్లేస్ లో ఉన్న మస్క్... నిమిషానికి ఎంత సంపాదిస్తాడు అనే విషయాలు తాజా తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా... ఇటీవలి ఫిన్ బోల్డ్ నివేదిక ప్రకారం తెరపైకి వచ్చింది.
ఈ నివేదిక ప్రకారం... ఎలాన్ మస్క్ నిమిషానికి సుమారు 6,887 డాలర్లు సంపాదిస్తున్నాడు. అంటే... భారత కరెన్సీలో సుమారు 5.71 లక్షలా రూపాయలన్నమాట. ఇదే సమయంలో... గంటకు 4,13,220 డాలర్లు.. అంటే... సుమారు 3.43 కోట్ల రూపాయలు కాగా... రోజుకు 99,17,280 డాలర్లు (82.33 కోట్ల రూపాయలు), వారానికి 6,94,20,960 డాలర్లు (576.64 కోట్ల రూపాయలు) సంపాదిస్తున్నాడు ఎలాన్ మస్క్.
ఇలా కాలిక్యులేటర్ సైతం కన్ఫ్యూజయ్యే స్థాయిలో అన్నట్లుగా సంపాదిస్తున్న ఎలాన్ మస్క్ సంపద టెస్లాలో 20.5 శాతం, స్టార్ లింక్ లో 54 శాతం, స్పేస్ ఎక్స్ లో 42 శాతం, ఎక్స్ (ట్విట్టర్) లో 74 శాతం, ది బోరింగ్ కంపెనీలో 90 శాతానికి పైగా, ఎక్స్ ఏఐ లో 25 శాతంతో పాటు మరిన్నింటితో సహా అనేక వ్యాపారాలలో మస్క్ హోల్డింగ్ లు ఉన్నాయి. వాస్తవానికి గత ఏడాది కంటే నికర విలువ కాస్త తగ్గి ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్నారు ఎలాన్ మస్క్!
కాగా... 1971లో దక్షిణాఫ్రికా రాజధాని ప్రిటోరియాలో ఎలోన్ మస్క్ జన్మించారు. సంపన్న కుటుంబం నుండి వచ్చిన మస్క్... చిన్నప్పటినుంచీ కంప్యూటర్లు, డిజైన్ పై నిత్యం బలమైన ఆసక్తి కలిగి ఉండేవాడట. ఈ క్రమంలోనే తన 17వ ఏట అతను కెనడాలోని క్వీన్స్ విశ్వవిద్యాలయంలో చేరాడు.. ఆపై వ్యాపారం, భౌతిక శాస్త్రాన్ని అభ్యసించడానికి పెన్సిల్వేనియా యూనివర్శిటీకి వెళ్లాడు.
ఈ క్రమంలో ఎలాన్ మస్క్, అతని సోదరుడు కింబాల్ "జిప్ 2" అనే ఆన్ లైన్ వ్యాపార డైరెక్టరీని స్థాపించారు. అనంతరం 1999లో ఈ సోదరులు ఇద్దరు ఆ "జిప్ 2"ని కాంపాక్ కి 307 మిలియన్ డాలర్లకు విక్రయించారు. ఇందులో ఎలాన్ మస్క్ ఈ విక్రయం ద్వారా 22 మిలియన్ డాలర్లు సంపాదించాడు. అక్కడ నుంచి మస్క్ వెనక్కి తిరిగి చూసుకోలేదు... ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ప్రపంచ కుభేరుల జాబితాలో టాప్ 2 లో ఉన్నాడు.