ట్విటర్ పిట్ట గొంతునులిమాడు.. ఆ ‘‘ఎక్స్’’ మ్యాన్
సామాజిక మాధ్యమాల్లో ట్విటర్ ప్రత్యేకతే వేరు. ఎన్ని మెసేజింగ్ యాప్ లున్నా ట్విటర్ కు ఏవీ సాటిరాలేదు. ఆ నీలి రంగు బ్యాక్ గ్రౌండ్ లో ఓ పక్షి రూపంతో ఉండే ట్విటర్ లోగో ఎంతో ముచ్చటగొలిపేది.
By: Tupaki Desk | 23 July 2023 12:40 PM GMTసామాజిక మాధ్యమాల్లో ట్విటర్ ప్రత్యేకతే వేరు. ఎన్ని మెసేజింగ్ యాప్ లున్నా ట్విటర్ కు ఏవీ సాటిరాలేదు. ఆ నీలి రంగు బ్యాక్ గ్రౌండ్ లో ఓ పక్షి రూపంతో ఉండే ట్విటర్ లోగో ఎంతో ముచ్చటగొలిపేది. అయితే, ఆరు నెలలుగా ఇంకా చెప్పాలంటే ఏడాది నుంచి ట్విటర్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అపర కుబేరుడు, స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ చేతిలోకి వెళ్లిన తర్వాత ట్విటర్ భారీ కుదుపులకు లోనైంది. ఓ దశలో సంస్థ ప్రధాన ఉద్యోగులు కూడా వెళ్లిపోయారు. సిబ్బందికి ఇంటి నుంచి పని విధానాన్ని రద్దు చేసి అనేక ఆంక్షలు పెట్టారు. ప్రధాన కార్యాలయంలో మరుగుదొడ్లు కూడా శుభ్రం చేసేవారు లేకుండా పోయారనే కథనాలు వచ్చాయి.
రూ.3.5 లక్షల కోట్లకు కొని..
ట్విటర్ ను ఎలాన్ మస్క్ రూ.3.5 లక్షల కోట్లకు కొన్నాడు. అయితే, దీనికిగాను బ్యాంకు రుణాలు తీసుకున్నాడు. మొదట ట్విటర్ బేరానికి దిగిన ఆయన తర్వాత నకిలీ ఖాతాలు ఎక్కువగా ఉన్నాయంటూ వెనక్కుతగ్గాడు. చివరకు అమెరికా కోర్టు హెచ్చరికలతో ట్విటర్ ను తీసుకోక తప్పలేదు. అయితే, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ట్విటర్ మెడకు చుట్టుకున్నట్లు కథనాలు వచ్చాయి. ఇప్పుడు తాజా సంచలనం ఏమంటే.. ట్విటర్ కు తలమానికమైన పక్షి లోగోకు మస్క్ బైబై చెబుతున్నాడట.
ట్విటర్ లోగో నుంచి పక్షి మాయమైపోతున్నదని మస్క్ ట్వీట్ చేశాడు. ఈ విషయాన్ని ఆదివారం తెలిపాడు. ట్విటర్ ను సరికొత్తగా ఏర్పాటు చేసిన ‘ఎక్స్ కార్ప్ ’ అనే సంస్థలో విలీనం చేస్తున్నట్లు గతంలో మస్క్ చెప్పాడు. ఇప్పుడు ‘‘త్వరలోనే మేం ట్విటర్ బ్రాండ్ కు.. ఆ తర్వాత క్రమంగా అన్ని పక్షులకు వీడ్కోలు పలకనున్నాం. ఈ రాత్రి పోస్టు చేసిన X లోగో బాగుంటే.. రేపటినుంచి ప్రపంచ వ్యాప్తంగా లైవ్ లోకి వస్తుంది’’ అని ట్వీట్ చేశాడు. మస్క్ ట్విటర్ ను కొన్నాక ఇదే అతిపెద్ద మార్పుగా చెప్పొచ్చు.
ఎక్స్ అంటే వల్లమాలిన అభిమానం
ఎలాన్ మస్క్ కు ‘‘ఎక్స్’’ అంటే విపరీతమైన అభిమానం. తన అంతరిక్ష యాన సంస్థకు స్పేస్ ఎక్స్ అనే పేరు పెట్టింది కూడా అందుకే.కాగా, ట్విటర్ సీఈవోగా లిండా యాకరినో ఇటీవల బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ‘‘ఎవ్రీ థింగ్ యాప్ ఎక్స్’’ గా ట్విటర్ ను మార్చడంలో లిండా కీలక పాత్ర పోషిస్తారని మస్క్ ట్వీట్ చేశారు. ఆ మార్పుల్లో భాగంగానే ఇప్పుడు ట్విటర్ పిట్ట ఎగిరిపోయింది.