ఎలాన్ మస్క్ మరో సంచలనం.. టెస్లా సైబర్ ట్రక్!
నవంబర్ 30న మొదటి టెస్లా సైబర్ ట్రక్ మార్కెట్ లోకి వచ్చాక దాన్ని కొన్న తర్వాత దాన్ని మొదటి సంవత్సరంలో పున: విక్రయించకుండా నిషేధం విధించారు.
By: Tupaki Desk | 14 Nov 2023 5:58 AM GMTప్రపంచ అపర కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఏం చేసినా సంచలనమే. తరచూ ఏదో ఒక సంచలన ఆవిష్కరణతో ప్రపంచం దృష్టిని ఆకర్షించే ఆయన మరోసారి కూడా అదే పని చేయబోతున్నారు. తన టెస్లా కంపెనీ నుంచి సైబర్ ట్రక్ ను అందుబాటులోకి తేనున్నారు. నవంబర్ 30న టెస్లా సైబర్ ట్రక్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సైబర్ ట్రక్ కు సంబంధించిన విక్రయ నిబంధనలను టెస్లా కంపెనీ విడుదల చేసింది.
నవంబర్ 30న మొదటి టెస్లా సైబర్ ట్రక్ మార్కెట్ లోకి వచ్చాక దాన్ని కొన్న తర్వాత దాన్ని మొదటి సంవత్సరంలో పున: విక్రయించకుండా నిషేధం విధించారు. ఈ మేరకు టెస్లా కంపెనీ తన నిబంధనల్లో ఈ విషయాన్ని పేర్కొంది. ఈ నిబంధన ఉల్లంఘిస్తే టెస్లా కొనుగోలుదారులపై 50,000 డాలర్లకు కోర్టులో దావా వేస్తుంది.
నవంబర్ 30న సైబర్ ట్రక్ ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న వినియోగదారులు టెస్లా నిబంధనలు మరియు షరతుల ప్రకారం.. సైబర్ ట్రక్ ను కొనుగోలు చేసిన మొదటి సంవత్సరంలో దానిని పునఃవిక్రయం చేయకూడదు. ఈ మేరకు టెస్లా తన మోటార్ వెహికల్ ఆర్డర్ అగ్రిమెంట్‌కు ’సైబర్ ట్రిక్ ఓన్లీ’ పేరుతో ఒక విభాగాన్ని జోడించింది.
‘మీ వాహనం డెలివరీ తేదీ తర్వాత మొదటి సంవత్సరంలో మీరు వాహనాన్ని విక్రయించరని లేదా విక్రయించడానికి ప్రయత్నించరని మీరు అంగీకరిస్తున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే 50,000 డాలర్లు లేదా అమ్మకం లేదా బదిలీకి సంబంధించి పరిగణనలోకి తీసుకున్న విలువలో ఏది ఎక్కువ అయితే అది లిక్విడేటెడ్ నష్టం కింద మీ నుండి డిమాండ్ చేయవచ్చు. టెస్లా భవిష్యత్తులో ఏవైనా వాహనాలను మీకు విక్రయించడానికి కూడా నిరాకరించవచ్చు’ అని టెస్లా కంపెనీ తన నిబంధనల్లో పేర్కొంది
అయితే, ఒక కస్టమర్ వారి సైబర్ ట్రక్‌ను విక్రయించడానికి సరైన కారణం ఉంటే.. టెస్లానే దానిని తిరిగి కొనుగోలు చేస్తుంది. దాని అసలు ధరలో నుంచి అప్పటివరకు వాహనం తిరిగిన దూరం, మరమ్మతుల ఖర్చు తదితరాలను మినహాయించి మిగిలిన డబ్బును వినియోగదారుడికి టెస్లా అందిస్తుంది.
కాగా సైబర్ ట్రక్ ను మొదట 2019లో తీసుకొస్తామని టెస్లా ప్రకటించింది. మొదట ధర 39,900 డాలర్ల నుండి ప్రారంభమవుతుందని చెప్పింది. అయితే ఇప్పటికి కానీ అది సాకారం కాలేదు.