Begin typing your search above and press return to search.

భారతీయుల కోసం ఎలాన్‌ మస్క్‌ ప్రత్యేక కారు ఇదే!

స్పేస్‌ ఎక్స్, ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎలాన్‌ మస్క్‌ ఏం చేసినా, ఏం మాట్లాడినా ప్రపంచవ్యాప్తంగా సంచలనమే

By:  Tupaki Desk   |   8 April 2024 10:30 AM GMT
భారతీయుల కోసం ఎలాన్‌ మస్క్‌ ప్రత్యేక కారు ఇదే!
X

స్పేస్‌ ఎక్స్, ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎలాన్‌ మస్క్‌ ఏం చేసినా, ఏం మాట్లాడినా ప్రపంచవ్యాప్తంగా సంచలనమే. ఎలాన్‌ మస్క్‌ కు చెందిన టెస్లా కార్లు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న బ్రాండ్‌ లలో ఒకటి.

అయితే విచిత్రంగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న ఇండియాలోకి మాత్రం టెస్లా ఇంతవరకు అడుగుపెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం సుంకాల విషయంలో విధించిన నిబంధనల పట్ల సంతృప్తి చెందని ఎలాన్‌ మస్క్‌ ఇన్నాళ్లూ ఇండియాకు దూరంగా ఉన్నారు.

ఇప్పుడు ఎట్టకేలకు అన్ని సమస్యలు పరిష్కారమవ్వడంతో టెస్లా ఇండియాలో కాలుమోపడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. టెస్లా ప్రస్తుతం జర్మనీలో కుడిచేతి వాటం (రైట్‌ హ్యాండ్‌ డ్రైవ్‌) కలిగిన కార్లను తయారు చేస్తోంది. ఈ ఏడాది చివర్లో వాటిని భారతదేశానికి ఎగుమతి చేయాలని యోచిస్తోంది.

రైట్‌ హ్యాండ్‌ డ్రైవ్‌ వాహనాలు ఉన్న అతి కొద్ది దేశాల్లో మనదేశం కూడా ఒకటనే విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించే ఉద్దేశంతో వాటిని తయారుచేసే కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం పన్ను ఉపశమనాలను ప్రకటించింది. ఈ క్రమంలో ఇటీవల ఎలక్ట్రిక్‌ కార్లపై పన్నులను తగ్గించింది. అయితే సంబంధిత కంపెనీలు మనదేశంలో కనీసం 500 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా కంపెనీని ఏర్పాటు చేసిన మూడేళ్లలోగా కార్లను తయారు చేయాల్సి ఉంటుంది.

టెస్లా ఇప్పటికే భారతదేశ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కార్లను తయారు చేయడం మొదలుపెట్టింది. ఈ చివరి నాటికి ఆ కార్లు భారత్‌ కు చేరుకోవాల్సి ఉంది. అయితే టెస్లా ఏ మోడల్‌ ను భారత్‌ కు ఎగుమతి చేస్తుందనే విషయం మీద స్పష్టత లేదు. ప్రస్తుతం టెస్లా జర్మనీలో మోడల్‌ వైను మాత్రమే రూపొందించింది.

మనదేశంలో ఎలక్ట్రిక్‌ కార్ల కోసం టెస్లా ప్రణాళికలో ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ ను నిర్మించడం, ఫ్యాక్టరీ కోసం 2 బిలియన్‌ డాలర్లను అదనంగా ఖర్చు చేయడం ఉన్నాయి. ఇందులోనే స్థానికంగా మరిన్ని భాగాలను కొనుగోలు చేయడం వంటివి కూడా ఉన్నాయి.

కాగా టెస్లా తన కర్మాగారం కోసం రెండు రాష్ట్రాలను పరిశీలిస్తోంది: మహారాష్ట్ర, గుజరాత్‌ లపై దృష్టి సారించింది. గుజరాత్‌ ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో కావడంతో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తోంది. రెండేళ్లలో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది.

కాగా టాటా మోటార్స్‌ ప్రస్తుతం భారతదేశంలో ప్రధాన ఎలక్ట్రిక్‌ కార్‌ కంపెనీగా ఉంది. ఈ క్రమంలో 2030 నాటికి భారతదేశంలో విక్రయించే అన్ని కార్లలో 30% ఎలక్ట్రిక్‌ కార్లు ఉండాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశాన్ని టెస్లా ఒక పెద్ద అవకాశంగా చూస్తోంది. భారత్‌ లాంటి పెద్ద మార్కెట్‌ లో కాలు పెట్టడమే లక్ష్యంగా ముందుకు కదులుతోంది. దాన్ని సాధించడానికి తీవ్రంగా కృషి చేస్తోంది.