Begin typing your search above and press return to search.

ట్విటర్.. ఇకపై ప్రతి నెలా చెల్లింపులు జరిపితేనే 'సేవలు'?

తన చేతికి వచ్చినప్పటి నుంచి ఎక్స్ లో బోలెడన్ని మార్పులు చేసిన ఎలాన్.. తన మనసులోని మాటను తాజాగా చెప్పేశారు

By:  Tupaki Desk   |   20 Sep 2023 4:02 AM GMT
ట్విటర్.. ఇకపై ప్రతి నెలా చెల్లింపులు జరిపితేనే సేవలు?
X

అనుకున్నదే జరిగింది. ఫక్తు వ్యాపార ధోరణితో వ్యవహరించే ఎలాన్ మస్క్ చేతికి ట్విటర్ వెళ్లినంతనే.. రాబోయే రోజుల్లో ఉచిత సర్వీసుకు చెక్ పెట్టేసి.. పేమెంట్ రూపంలోకి తీసుకెళతారన్న వాదన మొదలైంది. ఇందుకు తగ్గట్లే ట్విటర్ పేరును ఎక్స్ గా మార్చేసిన అతగాడు.. కొన్ని సేవలు అందాలంటే డబ్బులు కట్టాలంటూ మొదలు పెట్టిన అతను బ్లూ టిక్ కోసం నెలకు రూ.900 ఛార్జ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దాని స్థానే.. ఎక్స్ (అదేనండి ట్విటర్) వాడే ప్రతి యూజర్ ఎంతో కొంత చెల్లింపులు జరిపితే తప్పించి.. దీన్నియాక్సిస్ చేయలేని పరిస్థితికి తెచ్చేసే దిశగా ఎలాన్ మస్క్ ప్రయత్నాలు చేస్తున్నారు.

తన చేతికి వచ్చినప్పటి నుంచి ఎక్స్ లో బోలెడన్ని మార్పులు చేసిన ఎలాన్.. తన మనసులోని మాటను తాజాగా చెప్పేశారు. అది కూడా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో చర్చించే సందర్భంగా తన మనసులోని మాటను ప్రపంచానికి చెప్పేశారు. ఎక్స్ వాడే ప్రతి ఒక్కరు నెల వారీగా చెల్లింపులు చేయాల్సిందేనని తేల్చేశారు. ఎప్పటిలానే.. తన బాదుడుకు జస్టిఫికేషన్ ఇస్తున్నట్లుగా వాదనను వినిపించారు.

ఎక్స్ లో ఉన్న బాట్స్ ను తొలగించేందుకు ఇదే సరైన మార్గమన్న అతను.. ప్రస్తుతం 550 మిలియన్ల యూజర్లు నెల వారీగా ఉండగా.. సగటున రోజుకు 100 మిలియన్ పోస్టులు పెడుతున్నారని.. ఇందులో బాట్స్ కూడా ఉన్నాయని చెప్పారు. బాట్స్ తొలగించాలంటే స్వల్పమైన మొత్తంలో ఫీజు వసూలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇలా చేస్తేనే బాట్స్ కు అడ్డుకట్ట వేసే వీలుందన్న అతను.. ట్విటర్ కొనుగోలు చేసే టైంలోనూ బాట్స్ గురించి ప్రస్తావించటాన్ని గుర్తు చేస్తున్నారు.

ఎక్స్ వాడాలంటే ప్రతి ఒక్కరు నెల వారీగా చెల్లింపులు జరపాల్సిందేనని చెప్పిన మస్క్.. ఆ మొత్తం ఎంత ఉంటుందన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఇప్పటివరకు బ్లూ టిక్ కోసం నెల వారీగా రూ.900 చెల్లింపులు జరపాల్సి ఉండటం తెలిసిందే. వెబ్ యూజర్లు అయితే రూ.650 పే చేయాలి. తాజాగా ఎలాన్ నోటి నుంచి వచ్చిన మాటల్ని చూస్తే.. ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తీసుకోని వారు సైతం నెల వారీగా ఎంతో కొంత మొత్తం చెల్లించక తప్పదంటున్నారు. ట్విటర్ ను కొనుగోలు చేసేందుకు వేల కోట్లు ఖర్చు చేసిన ఎలాన్.. వాటిని వడ్డీతో సహా సబ్ స్క్రిప్షన్ల రూపంలో జనాల నుంచి డబ్బులు వెనక్కి తీసుకునే వ్యూహాన్ని దశల వారీగా అమలు చేస్తున్నట్లుగా చెప్పక తప్పదు. ఇది వర్కువుట్ అయితే.. వాట్సాప్.. ఫేస్ బుక్.. తదితరాలు సైతం పేమెంట్ మోడ్ లోకి వెళితే పరిస్థితేంటి?