సంపద కోల్పోవడంలోనూ రికార్డే...ఒకే రోజు 1.3 లక్షల కోట్లు ఆవిరి!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద సృష్టించడంలో రికార్డులు నెలకొల్పాడు. అందుకే టాప్ రిచ్చెస్ట్ పెర్సన్ గా నిలబడ్డాడు
By: Tupaki Desk | 20 Oct 2023 8:31 AM GMTప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద సృష్టించడంలో రికార్డులు నెలకొల్పాడు. అందుకే టాప్ రిచ్చెస్ట్ పెర్సన్ గా నిలబడ్డాడు. ఇదే సమయంలో సంపదను కోల్పోవడంలో కూడా మస్క్ రికార్డ్ సృష్టించాడు! ఇందులో భాగంగా ఒక్కరోజులో ఆయన సంపదలో 16.1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.30 లక్షల కోట్లు) ఆవిరయ్యాయి. అయినప్పటికీ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగానే మస్క్ కొనసాగుతున్నారు.
అవును... టెస్లా షేర్ల పతనంతో మస్క్ ఒక్కరోజులో రూ.1.30 కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. టెస్లా షేర్ల పతనమే అందుకు కారణం అని తెలుస్తుంది. జులై - సెప్టెంబర్ త్రైమాసికంలో టెస్లా ఫలితాలు ఇన్వెస్టర్స్ ని నిరాశపర్చాయి. అయితే... గురువారం కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఎంత నష్టం వచ్చినా.. మస్క్ ప్రభంజనం మాత్రం తగ్గలేదు!
బ్లూం బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. 210 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ కొనసాగుతున్నారు. ఈ ఏడాది మస్క్ సంపద ఇప్పటి వరకు 70 బిలియన్ డాలర్లు పెరగగా... టెస్లా షేర్లు గురువారం ఏకంగా 9.3 శాతం నష్టపోయి 220.11 డాలర్ల వద్ద స్థిరపడింది.
ఇతర కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకొని నిలబడేందుకు టెస్లా గత కొన్ని నెలల్లో కార్ల ధరలను భారీగా తగ్గించింది. దీంతో జులై - సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభంలో ఏకంగా 44 శాతం క్షీణత నమోదైంది. ఇదే సమయంలో ఇన్ కం విషయంలో కూడా విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో టెస్లా షేర్లలో పతనం నమోదైంది. అది కూడా రికార్డ్ స్థాయిలో కావడం గమనార్హం.
టెస్లా ఆర్థిక ఒడుదొడుకుల ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోగలదంటూ ఇప్పటి వరకు చెప్పిన మస్క్.. తాజా ఫలితాల ప్రకటన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వడ్డీరేట్ల పెంపు వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చాలా తీవ్రంగా ఉందని చెప్పుకొచ్చారు. ఫలితంగా గిరాకీ నెమ్మదించిందని తెలిపారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనప్పటికీ.. కస్టమర్లకు అందించాల్సిన 1.8 మిలియన్ల కార్లను డెలివరీ చేసి తీరతామని టెస్లా తెలిపింది.
ఎక్స్ లో కొత్త పద్దతి... నాట్ ఎ బాట్:
కాగా... "ఎక్స్ హెల్ప్ సెంటర్ పేజ్"లో "నాట్ ఏ బోట్" పేరుతో ఓ పోస్ట్ ను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రెండు దేశాల్లోని కొత్త వినియోగదారుల కోసం కొత్త సబ్ స్క్రిప్షన్ పద్ధతి "నాట్ ఎ బాట్" ని పరీక్షించడం ప్రారంభించినట్లు ఎక్స్ యాజమాన్యం తెలిపింది.
స్పాం, మానిప్యులేషన్ ను తగ్గించేలా ఇప్పటికే చేస్తున్న ప్రయత్నాలను మరింత బలోపేతం చేసేలా ఈ టెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా... అయితే ఈ నగదు చెల్లింపులు ఇప్పటికే ఎక్స్ వినియోగిస్తున్న యూజర్లకు వర్తించదని పోస్ట్ లో హైలెట్ చేసింది.
ప్రయోగాత్మకుంగా ప్రస్తుతం న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ లో మాత్రమే ఈ నాట్ ఎ బాట్ అనే కొత్త సబ్ స్క్రిప్షన్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్కడ విజయవంతమైతే త్వరలోనే అన్ని దేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.