ఎక్స్ తో మస్క్ కు రిస్కేనా?
డిసెంబర్ 30, 2023 నాటి ఫిడిలిటీ సెక్యూరిటీస్ ఫైలింగ్ ప్రకారం.. ఎలాన్ మస్క్ అక్టోబర్ 2022లో ట్విట్టర్ ను కొనుగోలు చేయగా అప్పటి నుంచి∙71.5% దాని విలువ తగ్గిపోయింది.
By: Tupaki Desk | 4 Jan 2024 4:30 PM GMTటెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధినేత.. ఎలాన్ మస్క్ ఏ క్షణంలో ట్విట్టర్ ను కొనుగోలు చేశారో కానీ.. అప్పటి నుంచి దాని ద్వారా ఆయన వివాదాల్లో కూరుకుపోతూనే ఉన్నారు. పోనీ అది లాభాల బాటలో అయినా ఉందంటే అదీ లేదు. 2022లో ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించారు. అంతేకాకుండా ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చారు. అందులో రకరకాల మార్పులకు తెరతీశారు.
ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిననాటి నుంచి దాని ఆదాయంలో ఎలాంటి వృద్ధి లేకపోవడం గమనార్హం. పైగా ఆయన ట్విట్టర్ ను కొనుగోలు చేసిన 2022 అక్టోబర్ నుంచి 2023 డిసెంబర్ 30 వరకు ఏకంగా 71.5 శాతం దాని విలువ తగ్గిపోయింది.
డిసెంబర్ 30, 2023 నాటి ఫిడిలిటీ సెక్యూరిటీస్ ఫైలింగ్ ప్రకారం.. ఎలాన్ మస్క్ అక్టోబర్ 2022లో ట్విట్టర్ ను కొనుగోలు చేయగా అప్పటి నుంచి∙71.5% దాని విలువ తగ్గిపోయింది. ట్విట్టర్ ను మస్క్ 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందులో 71.5 శాతం విలువ తగ్గిపోవడం గమనార్హం.
ఎక్స్ పతనానికి వినియోగదారులలో తగ్గుదల, ప్రకటనల విషయంలో ఎదురవుతున్న సవాళ్లు, కంటెంట్ నియంత్రణకు సంబంధించిన ఆందోళనలు కారణమని చెబుతున్నారు. ముఖ్యంగా డిస్నీ, యాపిల్, కోకా–కోలాతో సహా ప్రధాన ప్రకటనదారులు గతేడాది నవంబర్ లో ఎక్స్ నుండి చెల్లింపు ప్రకటనలను ఉపసంహరించుకున్నారు.
జూలై 2023లో ఎలాన్ మస్క్ ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చారు. ఫిడిలిటీ సెక్యూరిటీస్ ఫైలింగ్ ప్రకారం.. ఎక్స్ ప్రస్తుత అంచనా విలువ సుమారు 12.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఎలాన్ మస్క్ యాజమాన్యంలోకి వచ్చాక ఎక్స్ వినియోగదారులు 15 శాతం తగ్గిపోయారు.
ఎలాన్ మస్క్ ఎక్స్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి సిబ్బందిని గణనీయంగా తగ్గించారు. మొత్తం సిబ్బందిలో ఏకంగా 50 శాతం మందిని తగ్గించారు. అలాగే కంటెంట్ నియంత్రణను కూడా తగ్గించారు. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్.. ఎలాన్ మస్క్ కు హెచ్చరిక జారీ చేసింది. ఎక్స్ లో తప్పుడు సమాచారం ఎక్కువగా వ్యాపిస్తోందని హెచ్చరించింది.