Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ కు ఎలాన్ మస్క్ షాక్... కొత్త ఆందోళనలో అమెరికా!

ఇందులో భాగంగా క్రిమియాలో స్టార్‌ లింక్‌ సేవలను అందించాలని అడిగింది. అయితే దీనికి ఎలాన్ మస్క్‌ తిరస్కరించారు. తాజాగా ఈ విషయాన్ని ఆయన స్వయంగా అంగీకరించారు కూడా.

By:  Tupaki Desk   |   12 Sep 2023 2:13 PM GMT
ఉక్రెయిన్  కు ఎలాన్  మస్క్  షాక్... కొత్త ఆందోళనలో అమెరికా!
X

యుద్ధం వంటి కీలక సమయాల్లో ప్రైవేటు సంస్థలు, వ్యక్తులపై ఆధారపడితే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో, అలా ఆధారపడిన దేశాలు ఎన్ని ఇబ్బందులు ఎదూర్కొంటాయో తెలిపేందుకు సరిపడేట్లుగా తాజాగా ఒక ఉదంతం వెలుగులోకి వచ్చింది. అదే రష్యా – ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధ సమయంలో ఉక్రెయిన్ కు ఎలాన్ మస్క్ ఇచ్చిన షాక్!

అవును... ఉక్రెయిన్‌ లో గత ఏడాది స్టార్‌ లింక్‌ సేవలను వినియోగించుకునేందుకు స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ అనుమతినివ్వకపోడం అమెరికా రక్షణ వర్గాలను సందేహంలో పడేసాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో సైనికపరమైన ఒప్పందాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సంఘటన గుర్తుచేసిందని అమెరికా అధికారులు చెబుతున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... గత ఏడాది సెప్టెంబరులో సెవెస్టొపోల్‌ పోర్ట్‌ లోని రష్యా నావికా దళానికి చెందిన నౌకలను ధ్వంసం చేసేందుకు ఉక్రెయిన్‌.. ఎలాన్‌ మస్క్‌ సాయం కోరింది. ఇందులో భాగంగా క్రిమియాలో స్టార్‌ లింక్‌ సేవలను అందించాలని అడిగింది. అయితే దీనికి ఎలాన్ మస్క్‌ తిరస్కరించారు. తాజాగా ఈ విషయాన్ని ఆయన స్వయంగా అంగీకరించారు కూడా.

ప్రముఖ రచయిత వాల్టర్‌ ఐజాక్సన్‌ రాసిన ఎలాన్‌ మస్క్‌ జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకంలో ఈ మేరకు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌ కు స్టార్‌ లింక్‌ సేవలను అందించడంపై కూడా పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి.

ఈ సందర్భంగా ఉక్రెయిన్ కు స్టార్ లింక్ సేవలు నిలివేయడపైనా మస్క్ వివరణ ఇచ్చారు. ప్రతిదాడిగా రష్యా అణ్వస్త్రాలను ప్రయోగించే ప్రమాదం ఉందనే ఆందోళనతోనే తాను ఆ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. కాగా... 2014లో క్రిమియాను రష్యా తమ అధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

సరిగ్గా ఈ సమయంలోనే అమెరికా జోక్యం చేసుకుంది. ఉక్రెయిన్‌ కు నిరంతర సేవలు అందించేలా స్టార్‌ లింక్‌ తో ఒప్పందం కుదుర్చుకొంది. కేవలం ఉక్రెయిన్‌ విషయంలోనే కాకుండా అమెరికా ఇతర విషయాల్లోనూ స్పేస్‌ ఎక్స్‌ పై ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో గతంలో ఉక్రెయిన్ కు హ్యాండ్ ఇచ్చినట్లు స్పేస్ ఎక్స్ కీలక సమయంలో హ్యాండ్ ఇస్తే పరిస్థితి ఏమిటనే ఆలోచన అమెరికా చేస్తుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో భవిష్యత్‌ లో కీలక సమయాల్లో ఇలా వాణిజ్య సేవలు అందించేవారు తిరస్కరిస్తే పరిస్థితి ఏంటనేదానిపై ఆందోళన నెలకొందని అమెరికా అధికారులు వెల్లడిస్తున్నారు. ఫలితంగా రాబోయే రోజుల్లో సైనిక పరమైన ఒప్పందాల విషయంలో ఎలా వ్యవహరించాలో చర్చిస్తున్నామని తెలిపారు.