Begin typing your search above and press return to search.

ఆళ్ల రిజైన్‌.. మారిన ఏలూరు రాజ‌కీయం.. !

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని(కాళీకృష్ణ శ్రీనివాస్‌) ఆ పార్టీకి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Aug 2024 3:30 PM GMT
ఆళ్ల రిజైన్‌.. మారిన ఏలూరు రాజ‌కీయం.. !
X

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని(కాళీకృష్ణ శ్రీనివాస్‌) ఆ పార్టీకి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. త‌ర్వాత‌.. రాజ‌కీయాల నుంచి కూడా త‌ప్పుకొంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇది జ‌రిగి వారం రోజులుకూడా గ‌డ‌వ‌క‌ముందే.. నియోజ‌క‌వ‌ర్గంలో సంచ‌ల‌నాలు చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌ధానంగా వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం ప్రభావంతో ఆ పార్టీ నుంచి వ‌ల‌సలు ప్రారంభ‌మ‌య్యాయి.

ఈ క్ర‌మంలోనే ఏలూరు నియోజ‌క‌వ‌ర్గంలోనూ నాయ‌కులు త‌మ దారి తాము చూసుకుంటున్నారు. ఇప్ప టికే కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా, ఏలూరు నగర మేయర్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేర‌నున్న‌ట్టు తెలిసింది. వాస్త‌వానికి ఈ విష‌యం ఆళ్ల‌కు తెలుసున‌ని అంటున్నారు. అన్నీ తెలిసిన త‌ర్వాతే.. వారిని ఆప‌డం త‌న వ‌ల్ల‌కాద‌ని నిర్ణ‌యించుకున్న త‌ర్వాతే.. పార్టీకి, రాజ‌కీయాల‌కు కూడా దూర‌మ‌య్యారు.

ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో ఈ నెల 27న ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో చేరుందుకు వైసీపీ కీల‌క నాయ‌కులు నూర్జ‌హాన్‌, పెద్ద‌బాబు.. వారి అనుచ‌రులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. వీరితో పాటు ఏలూరు నగరానికి చెందిన మరో 39 మంది కీలక నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమవుతున్నారు. వారితో ఇప్పటికే ఎమ్మెల్యే సంప్రదింపులు చేశారు. ఈ క్ర‌మంలోనే వారి చేరిక‌ల‌కు పార్టీ అధినేత చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలిసింది.

మేయర్ నూర్జహాన్, పెదబాబుల రాజకీయ జీవితం టీడీపీతోనే మొదలైంది. 2013లో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి బుజ్జి సమక్షంలో వీరు టీడీపీలోకి వచ్చారు. నగర పాలక సంస్థ ఎన్నికల సమయంలో నూర్జహాన్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో నూర్జహాన్ విజయం సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. తర్వాత జరిగిన పరిణామాల్లో 2019 ఎన్నికల సమయంలో వీరిద్దరూ వైసీపీలోకి వెళ్లారు. దీంతో మరోసారి మేయర్ పదవి వరించింది. ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు.