జస్ట్ నైన్: ఏలూరులో కూటమి పాగా!
ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రాజకీయాలు రోజుకోరకంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి రాజకీయాలు సాగుతాయో చెప్పడం కష్టంగా మారింది.
By: Tupaki Desk | 3 Sep 2024 5:06 AM GMTరాజకీయాలు రాజకీయాలే. ఎవరు ఎన్ని సుద్దులు చెప్పినా.. క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు వారి సేఫ్ వారు చూసుకుం టారు. దీనిని వారు సమర్థించుకుంటారు కూడా. పార్టీ అధినేతలు తమ ఇష్టానుసారం నిర్ణయం తీసుకున్నప్పుడు.. తాము తీసుకుంటే మాత్రం తప్పేంటని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏలూరు కార్పొరేషన్ పరిధిలోనూ ఇదే తరహా వాదన వినిపిస్తోంది. ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రాజకీయాలు రోజుకోరకంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి రాజకీయాలు సాగుతాయో చెప్పడం కష్టంగా మారింది.
2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏలూరును వైసీపీ ఏకపక్షంగా దక్కించుకుందనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం 50 మంది కార్పొరేటర్లలో 47 మంది వారే ఉండడం.. ఈ వాదనకు బలం చేకూరుస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. సరే.. ఈవిషయం పక్కన పెడితే.. తొలిసారి ఏలూరు కార్పొరేషన్ మేయర్ పదవిని నూర్జహాన్ అనే మహిళకు కేటాయించారు. ఇది సామాజిక న్యాయ కోణంలో జగన్ తీసుకున్న నిర్ణయమని అప్పట్లో వైసీపీ ప్రచారం చేసుకుంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని అనుచరుడు పెదబాబు చక్రం తిప్పారు.
అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత.. సహజంగానే రాజకీయాలు మారుతున్నాయి. దీంతో ఏలూరు కార్పొరేషన్‌లోనూ టీడీపీ వైపు మొగ్గుతున్న నాయకులు పెరుగుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఆళ్ల నానీకి రైట్ హ్యాండ్గా ఉన్న పెదబాబు.. ఆయన పార్టీకి రాజీనామా చేయడంతో తన పంథాకూడా మార్చుకున్నారు. నూర్జహాన్‌తో కలిసి టీడీపీ కి జైకొట్టారు. ఇక, వీరి వెనకాల.. మరో 15 మంది వైసీపీ కార్పొరేటర్లు సైకిల్ ఎక్కారు. మొత్తం 50 మంది కార్పొరేటర్లలో 26 మంది ఏ పార్టీవైపు ఉంటే.. ఆ పార్టీదే కార్పొరేషన్. సో.. ఇప్పటి వరకు టీడీపీకి 17 మంది కార్పొరేటర్లు.. జై కొట్టారు.
దరిమిలా.. ఇప్పుడు మరో 9 మంది.. 'జస్ట్ నైన్' మెంబర్స్ కోసం టీడీపీ ఎదురు చూస్తోంది. ప్రస్తుతం వరదలు, భారీ వర్షాల కారణంగా.. ఈ వ్యూహంపై ఆలోచనను పక్కన పెట్టారు. అయితే.. వచ్చే నెల నాటికి పూర్తిగా ఏలూరు కొర్పొరేషన్‌ను తమవైపు మళ్లించుకునేందుకు టీడీపీ అయితే.. ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. మొత్తంగా 9 మంది కనుక జంప్ అయితే.. ఏలూరు వైసీపీ ఖాతా నుంచి టీడీపీ ఖాతాలో పడిపోవడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే చిత్తూరు, ఒంగోలు మునిసిపాలిటీలు కూటమి ఖాతాలో పడిన విషయం తెలిసిందే.