Begin typing your search above and press return to search.

దక్షిణ కొరియా నియంతకు షాక్.. 6 గంటల్లోనే ఎమర్జెన్సీని ఎత్తేశారెందుకు?

పలు దేశాలు నియంతల ఏలుబడిలో నరకాన్ని చవి చూస్తున్న వేళ.. అందుకు భిన్నంగా దక్షిణ కొరియా ప్రజలు వ్యవహరించిన తీరు ప్రపంచానికి సరికొత్త పాఠంగా చెప్పాలి.

By:  Tupaki Desk   |   6 Dec 2024 5:30 AM GMT
దక్షిణ కొరియా నియంతకు షాక్.. 6 గంటల్లోనే ఎమర్జెన్సీని ఎత్తేశారెందుకు?
X

సంపన్న దక్షిణ కొరియాకు ఏమైంది? ఉన్నట్లుండి దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లుగా దేశాధ్యక్షుడు ప్రకటన చేయటంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి. కట్ చేస్తే.. ఆరు గంటల వ్యవధిలోనే ఆ దేశంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం.. ఎమర్జెన్సీని విధించిన దేశాధ్యక్షుడు వెనక్కి తగ్గి తాను విధించిన అత్యవసర పరిస్థితి ఆదేశాల్ని రద్దు చేయటం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ఒక రాజనీతి ప్రముఖుడు చేసిన వ్యాఖ్యలు గుర్తుకు వస్తాయి. ప్రజలకు ప్రభుత్వం భయపడినంత కాలం స్వేచ్ఛ ఉంటుందని.. ప్రభుత్వానికి ప్రజలు భయపడితే నియంత్రత్వం తప్పదన్నది అక్షర సత్యంగా చెప్పాలి. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సెక్ యోల్ హఠాత్తుగా దేశంలో విధించిన సైనిక పాలన ఎందుకు రద్దైందో తెలుసా? ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతే.

అవును.. పలు దేశాలు నియంతల ఏలుబడిలో నరకాన్ని చవి చూస్తున్న వేళ.. అందుకు భిన్నంగా దక్షిణ కొరియా ప్రజలు వ్యవహరించిన తీరు ప్రపంచానికి సరికొత్త పాఠంగా చెప్పాలి. రాజ్య వ్యతిరేక శక్తుల్ని సాధ్యమైనంత త్వరగా ఏరిపారేసేందుకు.. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఎమర్జెన్సీ విధింపు.. సైనిక పాలన తప్పనిసరిగా పేర్కొంటూ బుధవారం రాత్రి దేశాధ్యక్షుడు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియాకు చెందిన కమ్యూనిస్టు పాలకులతో విపక్షాలు కుమ్మక్కు అయ్యాయని.. దేశాన్ని అస్థిరపర్చాలని చూస్తున్నట్లుగా ఆరోపించారు.

అలా ఎందుకు జరిగింది? ఆ ప్రకటన వెనుక అసలు లెక్కేంటన్న విషయంలోకి వెళితే.. ఇటీవల కాలంలో ఆ దేశంలో చోటు చేసుకున్న పరిణామాల్ని ప్రస్తావించాల్సిందే. అప్పుడే అసలు విషయాలు అర్థమవుతాయి. సంపన్న దక్షిణ కొరియాకు ఉన్న అసలు సమస్య ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. తలసరి ఆదాయం 36వేల డాలర్లు. మన రూపాయిల్లో చెప్పాలంటే.. రూ.30.48 లక్షలు. ఈ దేశానికి పొరుగున ఉన్న చైనాతో పోల్చినా తలసరి ఆదాయంలో మూడు రెట్లు అధికం.

మార్కెట్లను ఏలే ఎన్నో బ్రాండ్ లకు ఈ దేశం పుట్టినిల్లు. శామ్ సంగ్.. హ్యుందయ్.. కియా.. పోక్సో.. ఎల్ జీ.. ఎస్ కే ఇలా చెప్పుకుంటూ పోతే.. వందల కొద్దీ కంపెనీలు ఉన్నాయి. దాదాపు 600 కంపెనీలు భారత్ తో పాటు ఎన్నో దేశాల్లో భారీగా వ్యాపారాలు చేస్తున్నాయి. ఆయా దేశాల మార్కెట్లో బ్రాండ్ లీడర్లుగా వ్యవహరిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఎగుమతి (ఆరో స్థానంలో ఉంది) దారులో దక్షిణ కొరియా ఒకటి. ఆసియా ఖండంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. 2009 వరకు ఆ దేశం దరిదాపుల్లోకి ఆర్థిక మాంద్యం రాలేదు. పెద్ద వయస్కుల సంఖ్య పెరగటం.. జననాలు తగ్గటం సమస్యగా మారింది. దీనికి తోడు అధిక పని గంటలతో మానసిక ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయి.

పెళ్లిళ్లు వాయిదా వేసుకొని.. దంపతులు కలిసి ఉండే టైం తగ్గిపోయాయి. దీంతో తెలియని వెలితి ఆ దేశవాసుల్లో ఎక్కువైంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంతనే లింగ సమానత్వాన్ని పర్యవేక్షించే వ్యవస్థను రద్దు చేయటంతో పాటు.. మహిళలకు ఉండే వెసులుబాట్లలో కొన్నింటిని రద్దు చేశారు. వారానికి 52 గంటల పనిని కాస్తా మరింత పెంచే ప్రయతనం చేశారు. వైద్య రంగాన్ని ప్రక్షాళన చేస్తున్నామని చెప్పిన అస్తవ్యస్తంగా మార్చారు. దీంతో.. దేశం సమ్మెలతో హోరెత్తింది. దీనికి తోడు అవినీతి పెరిగింది.

ఇలాంటి పరిస్థితుల్లో మొన్నటి ఏప్రిల్ లో ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా మారాయి. 300 స్థానాలు ఉన్న నేషనల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. విపక్షం డెమోక్రటిక్ పార్టీకి 180 సీట్లు వస్తే.. అధికారపక్షం 108 స్థానాలకు పరిమితమైంది. మరోవైపు 1987కు ముందున్న సైనిక పాలన.. నాటి సైనిక పాలకులను కీర్తించటం దేశాధ్యక్షుడికి అలవాటుగా మారింది. ఇప్పటి దేశాధ్యక్షుడు మితవాత పీపుల్ పవర్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

2022లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసే నాటికి యూన్ పెద్దగా ఎవరికి తెలీదు. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోవటం.. నాటి ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన అసంత్రప్తితో దేశాధ్యక్షుడిగా విజయం సాధించారు. అయితే.. తన ప్రత్యర్థి కంటే కేవలం ఒక శాతం మాత్రమే ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అప్పట్లో దేశాధ్యక్షుడిగా ఉన్న మ్యుంగ్ సఫాయి కార్మికుడి కుమారుడు కావటం గమనార్హం. ఈ ఏడాది జరిగిన నేషనల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికారపక్షానికి చెంపదెబ్బగా మారటం.. త్వరలో అవిశ్వాస తీర్మానంతో 2027 వరకు ఉండాల్సిన అధ్యక్ష పదవి కొద్ది రోజుల్లోనే పోతుందన్న ప్రచారం ఎక్కువైంది.

ఇదే.. దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించటానికి కారణంగా చెబుతున్నారు. అయితే.. దేశాధ్యక్షుడు ఎప్పుడైతే ఎమర్జెన్సీని ప్రకటించారో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నిరసనలు చేపడుతూ రోడ్ల మీదకు వచ్చారు. వారి ఆగ్రహాన్ని గుర్తించిన అధికార.. విపక్ష ఎంపీలు పార్లమెంటు ముందు బారులు తీరారు. అయితే.. సైనికులు పార్లమెంటు ప్రధాన ద్వారాన్ని మూసేయటంతో ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగింది.

అంతే.. స్పీకర్ తో సహా ఎంపీలు ప్రజల సాయంతో పార్లమెంటు గోడలు దూకి.. కిటికీలు బద్ధలు కొట్టి పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించారు. సైనిక పాలన వెనక్కి తీసుకోవాలని దేశాధ్యక్షుడ్ని కోరే తీర్మానాన్ని సభకు హాజరైన 190 మంది ఎంపీలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇదంతా చూస్తే.. శత్రుదేశాల పేర్లు చెప్పి.. కమ్యూనిస్టుల పేరు చెప్పి ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరుకు దక్షిణ కొరియా ఎపిసోడ్ చెంపపెట్టులాంటిదని చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే బాసులు. వారు ఏం డిసైడ్ చేస్తే అదే ఫైనల్. అదే విషయం సౌత్ కొరియా ప్రజలు ఫ్రూవ్ చేశారని చెప్పాలి.