కొన్ని గంటల్లో తలకిందులైన దేశ రాజకీయాలు.. ద.కో.లో ఏమి జరుగుతుంది?
దక్షిణ కొరియాలో అనూహ్య పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... దేశాధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో "ఎమర్జెన్సీ మార్షల్ లా" విధించారు.
By: Tupaki Desk | 4 Dec 2024 5:26 AM GMTమంగళవారం రాత్రి దక్షిణ కొరియాలో ఊహించని పరిణామం తెరపైకి వచ్చింది. కొన్ని గంటల్లోనే దేశ రాజకీయాలు ఒక్కసారిగా తలకిందులైపోయాయి. వరుస అనూహ్య పరిణామాలు అధ్యక్షుడికి పదవీగండాన్ని తీసుకొచ్చాయి. దీంతో... దేశాధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమర్జెన్సీ ప్రకటించారు.
అవును... దక్షిణ కొరియాలో అనూహ్య పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... దేశాధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో "ఎమర్జెన్సీ మార్షల్ లా" విధించారు. ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటమే తన నిర్ణయానికి కారణం అని తెలిపారు. ఉత్తర కొరియా అనుకూల శక్తులను ఏరివేసేందుకు ఇదే సరైన నిర్ణయం అని స్పష్టం చేశారు.
ఇలా అధ్యక్షుడు ఎమర్జెన్సీని ప్రకటించడంతో దేశ ప్రజలంతా ఒక్కసారిగా షాకయ్యారు.. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోపక్క అధ్యక్షుడి ప్రకటనతో రంగంలోకి దిగిన సైన్యం.. పార్లమెంట్, ఇతర రాజకీయ సమావేశాలు నిర్వహించరాదని హుకుం జారీ చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి.
మరోపక్క అధ్యక్షుడి నిర్ణయాన్ని ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీతో తీవ్రంగా ఖండించగా.. సొంత పార్టీ నుంచి కూడా దీనిపై వ్యతిరేకత వచ్చింది. దీంతో... మంగళవారం అధరాత్రి ప్రత్యేకంగా సమావేశమై.. ఎమర్జెన్సీ అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకు వచ్చాయి. దీన్ని పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించడంతో.. మార్షల్ లా అమలు చట్టవిరుద్ధం అని స్పీకర్ ప్రకటించారు.
దీంతో... చేసేదేమీ లేక అధ్యక్షుడు యున్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇందులో భాగంగా... ఎమర్జెన్సీ విధిస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు మరో ప్రకటన చేశారు. దీంతో... బుధవారం తెల్లవారుజామున స్థానిక కాలమానం ప్రకారం 4:30 గంటల ప్రాంతంలో ఎమర్జెన్సీని ఎత్తివేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో... యూన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేస్తుంది. లేదంటే.. అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. అయితే... ప్రతిపక్ష పార్టీ డిమాండ్ పై యున్ ఇంకా స్పందించలేదు.
కాగా... 1980 తర్వాత తూర్పు ఆసియా దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం ఇదే తొలిసారి.