Begin typing your search above and press return to search.

70.. 40.. వారానికి ఎన్ని గంటలు పని? కేంద్రం చట్టం తెస్తుందా?

భారత దేశంలో అమలులో లేదు కానీ.. పాశ్చాత్య దేశాల్లో వారానికి ఐదు రోజులే పని.. అక్కడ మహా అయితే 40 గంటలకు కాస్త ఎక్కువ పని చేస్తారేమో.?

By:  Tupaki Desk   |   21 Sep 2024 7:41 AM GMT
70.. 40.. వారానికి ఎన్ని గంటలు పని? కేంద్రం చట్టం తెస్తుందా?
X

భారత దేశంలో అమలులో లేదు కానీ.. పాశ్చాత్య దేశాల్లో వారానికి ఐదు రోజులే పని.. అక్కడ మహా అయితే 40 గంటలకు కాస్త ఎక్కువ పని చేస్తారేమో.? ప్రభుత్వం అయినా, ప్రైవేటు అయినా కంపెనీలన్నీ ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్ వేర్ రంగం వచ్చాక మన వాళ్లకూ ప్రైవేటులో ఐదు రోజుల పని విధానం తెలిసింది. అంతకుముందు కేవలం కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులకు మాత్రమే ఐదు రోజల పని విధానం అమలులో ఉండేది. ఇప్పుడు తాజాగా ‘వారానికి ఐదు రోజుల పని’ చర్చకు వచ్చింది. దీనికి కారణం.. విధుల్లో ఉండగా ఓ మహిళా సీఏ అస్వస్థతకు గురై చనిపోవడమే.

ఆ సంస్థలో రోజుకు 14 గంటల పని

యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా (వైఏ) ఓ బహుళ జాతి సంస్థ. ఇందులో పనిచేస్తున్న కేరళ చెందిన అన్నా సెబాస్టియన్ అనే 26 ఏళ్ల యువతి గుండె పోటుతో మరణించింది. ఆఫీసు వేళల్లోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతోపాటు కంపెనీ వ్యవహరించిన ధోరణి కూడా వివాదాస్పదం అయింది. అన్నా అంత్యక్రియకలకు కంపెనీ ప్రతినిధి ఎవరూ హాజరుకాకపోడాన్ని ఆమె తల్లి నిలదీసింది. కాగా, అన్నాది కేరళలోని కొచ్చి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ స్పందించారు. పని ఒత్తిడే అన్నా మరణానికి కారణం అనే అంశంపై థరూర్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

నారాయణ మూర్తి చెప్పినట్లు 70 గంటలా?

స్వతహాగా ఓ సంస్థ వ్యవస్థపాకుడు అయిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గతంలో వారానికి 70 గంటల పనిఉండాలని గతంలో వ్యాఖ్యానించారు. ఇది పెద్ద దుమారమే లేపింది. అసలు ఒత్తిడి తగ్గించాల్సింది పోయి పెంచుతారా? ‘నేను మన దేశ యువతను విజ్ఞప్తి చేస్తున్నా. ‘ఇది నా దేశం. నా దేశం కోసం వారానికి 70 గంటల పాటు పని చేసేందుకు నేను సిద్ధం అంటూ యువత ముందుకురావాలి’’ అని నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అయిన తర్వాత సోషల్ మీడియాలో, వార్తా పత్రికల్లో ‘‘విషపూరిత పని సంస్కృతి, ఉద్యోగుల నుంచి యాజమాన్యాలు ఏమి ఆశిస్తాయి’’ అనే అంశంపై జోరుగా చర్చ జరిగింది. నారాయణ మూర్తికి మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు స్పందించారు. ఇన్ఫోసిస్‌ తో పాటు ఇతర భారతీయ టెక్ కంపెనీల్లో ఇంజనీర్లకు ప్రారంభ వేతనాలు తక్కువగా ఉండడాన్ని నొక్కి చెబుతూ కొందరు విమర్శలు చేశారు. అయితే, దీనికి భిన్నంగా థరూర్ 40 గంటల పని చాలని అంటున్నారు.

నెట్టింట్లో చర్చ

అన్నా సెబాస్టియన్ మరణంతో వారినికి నిర్దిష్ట పనిగంటల విధానంపై నెట్టింట్లో చర్చ జోరుగా సాగుతోంది. వారానికి 40 గంటలకు మించి పని ఉండకూదని, ఇందుకోసం పార్లమెంట్‌లో చట్టం తెచ్చేందుకు కృషి చేస్తామని అంటున్నారు ఐక్యరాజ్య సమితి మాజీ ఉప ప్రధాన కార్యదర్శి అయిన థరూర్. అంతేకాదు.. యర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఇండియాలో రోజుకు 14 గంటల పాటు తీవ్ర ఒత్తిడి మధ్య అన్నా నాలుగు నెలలు పనిచేసిందని బాంబు పేల్చారు. ఆమె మరణానికి ఇదే కారణమన్నట్లు వ్యాఖ్యలు చేశారు. అన్నా తండ్రితో మాట్లాడానని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో రోజుకు 8 గంటలు, వారానికి 5 రోజులకు మించి (మొత్తం 40 గంటలు) ఉద్యోగులతో పని చేయించకూడదంటూ అన్నా తండ్రి చేసిన సూచన తనకు నచ్చిందన్నారు. ‘‘పని ప్రదేశాల్లో నిర్ణీత క్యాలెండర్‌ ఉండాలి. మానవ హక్కులను అడ్డుకోకూడదు. అమానవీయ చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు, జరిమానాలు విధించేలా చట్టం తెచ్చేలా పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతాం’’ అని శశిథరూర్‌ ట్వీట్ చేశారు. దీంతోనే వారానికి ఎన్ని పని గంటల ఉండాలనే చర్చ మొదలైంది.

కదిలించిన అన్నా మరణం..

26 ఏళ్ల అన్నా ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే చనిపోవడం అందరినీ కలచివేసింది. జూలై 20న పుణెలోని ఆఫీసులో విధుల్లో ఉండగా.. అస్వస్థతకు గురైన ఆమెను కొలీగ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో పని ఒత్తిడే ఆమె మరణానికి కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అన్నా సెబాస్టియన్‌ తల్లి అనితా యర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై ఇండియా) హెడ్‌ కు లేఖ రాయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆపై తీవ్ర చర్చనీయాంశమైంది. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం స్పందించి విచారణ జరుపుతామని హామీ ఇచ్చింది.