Begin typing your search above and press return to search.

అధికారులది ఆకాంక్షా లేక ధీమానా ?

ఏపీలో ఒక అధికార పార్టీకి ఎపుడూ జరగని విధంగా వైసీపీ విషయంలో జరిగింది.

By:  Tupaki Desk   |   30 May 2024 3:37 AM GMT
అధికారులది ఆకాంక్షా లేక ధీమానా ?
X

ఏపీలో ఒక అధికార పార్టీకి ఎపుడూ జరగని విధంగా వైసీపీ విషయంలో జరిగింది. ఆ పార్టీ అధికారంలో ఉంటూ ప్రతిపక్షం అయింది. కీలక సమయంలో అధికారులు హ్యాండ్ ఇచ్చేశారు. ఉన్నత స్థాయి అధికారుల నుంచి పోలీస్ వ్యవస్థ కూడా వైసీపీని పూర్తిగా దూరం పెట్టేసింది. ఇది ఎన్నడూ ఎక్కడా జరగని పరిస్థితి. అది కూడా పోలింగ్ కి కొద్ది రోజుల ముందు నుంచే కావడం విశేషం. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ వైపే అధికార గణాలు ఉంటాయి. అలాగే చివరి దాకా పోలీస్ బలగాలూ కొమ్ము కాస్తాయి.

మరి వైసీపీ ప్రభుత్వ ఫెయిల్యూర్ నా లేక వారి అంచనాలు తప్పాయా లేక వ్యూహాలలో తడబాట్లు ఉన్నాయా అన్నది తెలియదు కానీ వైసీపీని పవర్ లో ఉండగానే బేఖాతరు చేసే పరిస్థితి ఏర్పడింది. కేవలం 23 సీట్లు వచ్చాయని అయిదేళ్ల పాటు గేలి చేసిన టీడీపీ, అదే విధంగా నోటా కంటే తక్కువ ఓట్లు అన్న బీజేపీ పార్టీ పెట్టి పదేళ్ళు అయినా ఏమీ సాధించలేదు అన్న విమర్శలు ఎదుర్కొన్న జనసేన పోలింగ్ రోజున పూర్తి ఆధిపత్యం చలాయించాయి.

అధికారులు పోలీసు వర్గాలు అంతా కూటమి మాటనే ఎక్కువగా విన్నారు అని ప్రచారం సాగింది. ఇక పల్నాడు జిల్లాలో అయితే చెప్పనవసరం లేదు. అలాగే సత్తెనపల్లి, గురజాల, తిరుపతి, చంద్రగిరి, జమ్మలమడుగు, తాడిపత్రి వంటి చాలా చోట్ల చూస్తే అధికార పార్టీ కార్యకర్తలను పరుగులు పెట్టించారు.

ఇవన్నీ పోలింగ్ రోజూ తరువాత జరిగిన ఉదంతాలు. ఇక చూస్తే అధికార వర్గాల విధేయతలు కూడా ఒక్కసారిగా మారిపోయాయని అమరావతిలోని సెక్రటేరియట్ సాక్షిగా చెబుతున్నారు. అక్కడ ఉద్యోగ వర్గాలు కూడా చీలిపోయాయి. కూటమికి బాహాటంగా మద్దతు ఇచ్చే సెక్షన్ ఓపెన్ అయిపోయింది. ఉన్నతాధికార వర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే పోలీసు వర్గాలలో కూడా చర్చ సాగుతోంది. కూటమితో సాన్నిహిత్యం నెరిపేందుకు చాలా మంది అధికారులు మొగ్గు చూపిస్తున్నారు అని అంటున్నారు. ఇలా చాలా ప్రచారం అయితే సాగుతోంది. ఇక ప్రతిపక్ష పాత్రలోకి వైసీపీ వచ్చేసిందా అన్నట్లుగా ఆ పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి చేస్తున్న ఆరోపణలు వ్యవస్థల మీద గొంతు చించుకుంటున్న తీరు అన్నీ అంతా చూస్తున్నారు. అయినా వైసీపీ వేదన అరణ్య రోదన అవుతోంది అని అంటున్నారు.

మరి వై నాట్ 175 అని వైసీపీ స్లొగన్స్ ఇచ్చి రంగంలోకి దిగింది. ఎన్నికలు పూర్తి అయిన తరువాత కూడా ఐప్యాక్ టీం తో మీటింగ్ పెట్టిన జగన్ 151 కంటే ఎక్కువ సీట్లనే ఈసారి గెలుస్తున్నామని చెప్పారు. మరి ఇన్ని చెప్పినా కూడా అధికార వర్గాలలో నమ్మకం లేదా అన్నదే చర్చగా ఉంది.

కూటమి వైపు వారు చూడడం, వచ్చేది కూటమే అని బలంగా విశ్వసించడం బట్టి చూస్తూంటే జూన్ 4న ఫలితాలే ఈ చిక్కు ముడిని విప్పాలని అంటున్నారు. ఏది ఏమైనా అధికారంలో ఉన్న ఒక ప్రభుత్వం విషయంలో యంత్రాంగంలోని కీలక వ్యక్తులు వ్యవహరిస్తున్న తీరు మాత్రం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. పొరుగున ఉన్న తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం రాజీనామా చేసేంతవరకూ మెజారిటీ అఫీషియల్ సెక్షన్లు అన్నీ వెంట ఉండి పనిచేశాయి. మరి ఏపీలో అటువంటి సీన్ లేదు అంటే తేడా భారీగా ఎక్కడో కొడుతోంది అని అంటున్నారు.