రూ.2వేల నోట్ల మార్పిడికి ఇవాళే ఆఖరి రోజు.. తర్వాతేం కానుంది?
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తెర మీదకు వచ్చిన రూ.2వేల నోట్ల చలామణిపై రిజర్వు బ్యాంక్ విధించిన గడువు ఈ రోజు (శనివారం)తో తీరనుంది.
By: Tupaki Desk | 30 Sep 2023 5:16 AM GMTపెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తెర మీదకు వచ్చిన రూ.2వేల నోట్ల చలామణిపై రిజర్వు బ్యాంక్ విధించిన గడువు ఈ రోజు (శనివారం)తో తీరనుంది. ఇప్పటికే రూ.2వేల నోట్ల చలామణిపై ఆర్ బీఐ స్పష్టమైన విధానాల్ని ప్రకటించటంతో పాటు.. ప్రజల వద్ద ఉన్న రూ.2వేల నోట్లను తిరిగి బ్యాంకులకు ఇచ్చేందుకు సెప్టెంబరు 30 వరకు గడువును విధించటం తెలిసిందే. ఈ రోజుతో ఆ గడువు తీరనుంది. అయితే.. చలామణీలో ఉన్న రూ.2వేల నోట్లకు సంబంధించి ఇప్పుడెలాంటి నిర్ణయాన్ని తీసుకోనున్నారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఆర్ బీఐ వర్గాల నుంచి అందుతున్న అనధికార సమాచారం ప్రకారం.. రూ.2వేలనోట్ల మార్పిడికి సంబంధించిన గడువును అక్టోబరు 31 వరకు పొడిగించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రవాస భారతీయుల ప్రయోజనాల్ని పరిగణలోకి తీసుకొని ఈ గడువు పెంచే వీలుందని చెబుతున్నారు. రూ.2వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నట్లుగా ఆర్ బీఐ ఈ ఏడాది మే 19న ప్రకటన చేయటం.. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను బ్యాంకుల్లోనూ.. వాణిజ్య సంస్థల్లోనూ డిపాజిట్ చేయాలని కోరారు. ఇందుకు సెప్టెంబరు 30ను ఆఖరు తేదీగా ప్రకటించారు.
సెప్టెంబరు ఒకటిన ఆర్ బీఐ చేసిన ప్రకటనను చూస్తే.. ఇప్పటివరకు రెండు వేల రూపాయిల నోటుకు సంబంధించి 93 శాతం నోట్లు ఆర్ బీఐకు చేరుకున్నట్లుగా ప్రకటించారు. వీటి విలువ రూ.3.32 లక్షల కోట్లు.. మరో రూ.24వేల కోట్లకు సంబంధించిన నోట్లు తిరిగి రావాల్సి ఉందని తేలింది. మరి.. ఈ నోట్లు వెనక్కి రావటం కోసం గడువు పెంచుతారా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగామారింది.
బ్యాంకింగ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రూ.2వేల నోట్ల రాక పూర్తిగా ఆగిపోయినట్లుగా చెబుతున్నారు. అనివార్య కారణాలతో గడువు లోపు నోట్లను మార్చుకోలేకపోతే.. ఆ నోట్లు ఏమవుతాయి? పనికిరావా? లాంటి వాటిపై ఆర్ బీఐ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ రోజుతో గడువు ముగిసిపోతున్న నేపథ్యంలో రూ.2వేల నోట్లకు సంబందించిన ప్రకటన రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.