Begin typing your search above and press return to search.

ఇక ఈడీ వంతు

కాకినాడు సీపోర్టు వాటాల బదిలీపై ఈడీ రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   19 Dec 2024 8:30 AM GMT
ఇక ఈడీ వంతు
X

కాకినాడు సీపోర్టు వాటాల బదిలీపై ఈడీ రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. తనను బెదిరించి కంపెనీ షేర్లను బలవంతంగా రాయించుకున్నారని సీపోర్టు ఓనర్ కేవీ రావు ఫిర్యాదుతో ఇప్పటికే సీఐడీ కేసు నమోదు చేయగా, మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఎన్స్ ఫోర్సమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఇప్పుడు నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది. సీఐడీ కేసులో ఏ1గా ఉన్న వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి ఈ నోటీసులు అందినట్లు ప్రచారం జరుగుతోంది. విక్రాంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్నమ్మ కుమారుడు కావడంతో ఈ వ్యవహారంపై వాడివేడి చర్చ జరుగుతోంది.

2019లో వైసీపీ గెలిచిన తర్వాత కాకినాడ పోర్టులో వాటాల కోసం తనను బలవంతం చేశారని, అమెరికా నుంచి రప్పించి వాటాలు రాయించుకున్నారని గత నెలలో పోర్టు యజమాని కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో ఇప్పటికే సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జగన్ సోదరుడు వై.విక్రాంత్ రెడ్డి ఏ1 కాగా, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఏ2గా, విజయసాయిరెడ్డి అల్లుడు అరబిందో కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఏ3గా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. పోర్టు రికార్డులను ఆడిట్ చేసిన సంతానం కంపెనీ, వాటాలు దక్కించుకున్న అరబిందో కంపెనీ ఏ4, ఏ5గా కేసు పెట్టారు. అయితే ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందనే కోణంలో రంగంలోకి దిగిన ఈడీ కేవలం విక్రాంత్ రెడ్డికి మాత్రమే నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగిలిన నిందితులకు కూడా నోటీసులిస్తుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.

విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డిపై ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయి. వేర్వేరు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఇద్దరు బెయిల్ పై బయట ఉన్నారు. ఇప్పుడు కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ కేసు నమోదు చేస్తే పాత కేసుల్లో బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాకినాడ పోర్టులో 2,500 కోట్ల రూపాయల విలువైన వాటాలను కేవలం 494 కోట్లకు కొట్టేశారని, ఆ డబ్బు కూడా తమకు ఇవ్వలేదని గత నెలలో డీజీపీకి ఫిర్యాదు చేశారు కేవీ రావు. అదేవిధంగా పన్ను చెల్లింపుల్లో తమ సంస్థ 994 కోట్లు ఎగవేసిందని తప్పుడు నివేదిక ఇచ్చారని, పోర్టు వాటాల విక్రయం తర్వాత కేవలం 9 కోట్లు మాత్రమే అవకతవకలు జరిగినట్లు తేల్చారని మొత్తం వ్యవహారంలో తనకు అన్యాయం జరిగిందని కేవీ రావు ఆరోపిస్తున్నారు.

ఒకవైపు సీఐడీ దర్యాప్తు కొనసాగుతుండగా, ఇప్పుడు ఈడీ రంగ ప్రవేశంతో అరెస్టులు జరిగే అవకాశం ఉందని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. సీఐడీ కేసుపై ముందస్తు బెయిల్ కోరుతూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఉన్నత న్యాయస్థానంలో ఎలాంటి తీర్పు వస్తుందో గానీ, ఈడీ కేసు నమోదు చేస్తే బెయిల్ లభించడం అంత సులువేమీ కాదని అంటున్నారు. కేసు తీవ్రత బట్టి యాక్షన్ ఉండే అవకాశం ఉండటంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేసును ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురికే పరిమితం చేస్తారా? సూత్రధారులు, పాత్రుధారులుగా ఇంకెవరి పేర్లైనా చేర్చే అవకాశం ఉందా? అనేది చర్చకు దారితీస్తోంది.