Begin typing your search above and press return to search.

అయ్యో పాపం.. ఇంగ్లండ్‌ క్రికెట్‌ టీమ్‌ కు ఎంత కష్టం?

అక్టోబర్‌ నుంచి జరగనున్న వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ లో హాట్‌ ఫేవరెట్‌ గా బరిలోకి దిగుతున్న జట్లలో ఇంగ్లండ్‌ ఒకటి

By:  Tupaki Desk   |   30 Sep 2023 4:15 AM GMT
అయ్యో పాపం.. ఇంగ్లండ్‌ క్రికెట్‌ టీమ్‌ కు ఎంత కష్టం?
X

అక్టోబర్‌ నుంచి జరగనున్న వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ లో హాట్‌ ఫేవరెట్‌ గా బరిలోకి దిగుతున్న జట్లలో ఇంగ్లండ్‌ ఒకటి. డిపెండింగ్‌ చాంపియన్‌ హోదాలో ఇంగ్లండ్‌ బరిలోకి దిగుతోంది. మంచి పేస్‌ బౌలర్లు, నాణ్యమైన ఆల్‌ రౌండర్లు ఉండటంతో ఈసారి కూడా ఇంగ్లండ్‌ కు కూడా కప్‌ గెలవడానికి అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ ఐపీఎల్‌ లో ఆడటంతో ఆ దేశ క్రికెట్లరందరికీ భారత మైదానాలు కొట్టిన పిండే అంటున్నారు.

ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచ కప్‌ కోసం ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు భారత్‌ కు చేరుకుంది. గువాహటి వేదికగా టీమ్‌ ఇండియాతో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ క్రమంలో ఆ జట్టు ఇంగ్లండ్‌ నుంచి ఇండియాకు చేరుకోవడానికి దాదాపు 38 గంటలపాటు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ స్టార్‌ బ్యాట్సమెన్‌ జానీ బెయిర్‌స్టో వెల్లడించారు. ఏకంగా 38 గంటలపాటు ప్రయాణం చేయాల్సి రావడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

తమ ప్రయాణానికి సంబంధించి జానీ బెయిర్‌ స్టో సోషల్‌ మీడియా వేదికగా ఒక ఫొటోను కూడా పంచుకున్నాడు. దాదాపు 38 గంటలపాటు విమానంలో ఎకానమీ తరగతిలోనే తాము ప్రయాణించామని వెల్లడించాడు. ఇతర ప్రయాణికులతో కలిసి ఒకే విమానంలో భారత్‌ కు చేరుకున్నామని తెలిపాడు. దీంతో తాము తీవ్ర గందరగోళానికి గురయ్యామని చెప్పాడు.

'విమానంలోకి అడుగు పెట్టిన తర్వాత దాదాపు 38 గంటలకుపైగా మా ప్రయాణం కొనసాగింది. దీంతో అంతా గందరగోళంగా మారిపోయింది'' అని బెయిర్‌ స్టో ఇన్‌స్ట్రాగామ్‌ లో ఒక స్టోరీ షేర్‌ చేశాడు.

బెయిర్‌ స్టో షేర్‌ చేసిన ఈ ఫొటోలో కెప్టెన్‌ జోస్‌ బట్లర్, వోక్స్‌ కూడా కనిపిస్తున్నారు. వారిద్దరితోపాటు ఇతర ప్రయాణికులు కూడా భారీగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఇరు జట్ల ఆటగాళ్లు తమ వార్మప్‌ మ్యాచ్‌ కోసం గువహటికి చేరుకున్నారు. శనివారం సెప్టెంబర్‌ 30న ఇరు దేశాల మధ్య వార్మప్‌ మ్యాచ్‌ కు సర్వం సిద్ధమైంది. గువహటి చేరుకున్న ఇంగ్లండ్‌ ఆటగాళ్లు మొయిన్‌ అలీ, అదిల్‌ రషీద్, జో రూట్, బెన్‌ స్టోక్స్‌ తోపాటు సిబ్బంది బస్సులో తమకు కేటాయించిన హోటల్‌ కు వెళ్లారు.

కాగా ఇంగ్లండ్‌ టీమ్‌ లో కెప్టెన్‌ జోస్‌ బట్లర్, జానీ బెయిర్‌ స్టో, బెన్‌ స్టోక్స్, జోరూట్‌ లపై ఆ దేశం భారీ ఆశలు పెట్టుకుంది. వీరితోపాటు మెయిన్‌ అలీ, లియామ్‌ లివింగ్‌ స్టోన్‌ సైతం తమదైన రోజు చెలరేగి ఆడగలరు.