Begin typing your search above and press return to search.

ఇంగ్లాండ్‌ టు భారత్‌... లక్ష కిలోల గోల్డ్ తరలింపు!

ఇలా ఇంగ్లాండ్ నుంచి తాజాగా తరలించబడ్డ బంగారాన్ని దేశీయంగా ముంబయి మింట్‌ రోడ్డు సహా నాగ్‌ పుర్‌ లోని పాత కార్యాలయాల్లో ఆర్బీఐ నిల్వ చేస్తుంటుంది.

By:  Tupaki Desk   |   1 Jun 2024 3:56 AM GMT
ఇంగ్లాండ్‌ టు భారత్‌... లక్ష కిలోల గోల్డ్ తరలింపు!
X

ఇంగ్లాండ్ నుంచి భారత్ కు తాజాగా దాదాపు 100 టన్నులు అంటే లక్ష కిలోల బంగారం తరలించబడింది. ఈ స్థాయిలో బంగారాన్ని ఇంగ్లాండ్ నుంచి భారత్ కు తరలించడం ఆషామాషీ వ్యవహారం కాదనే సంగతి తెలిసిందే. దీంతో... ఈ రవాణా కార్యక్రమం కోసం కొన్ని నెలలుగా కసరత్తులు చేశారు. ఆఖరికి తాజాగా ఆ లక్ష కిలోల బంగారం భారత్ కు సేఫ్ గా చేర్చబడింది.

అవును... ఇంగ్లాండ్‌ నుంచి భారత్ కు భారీఎత్తున బంగారం నిల్వలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరలించింది. సుమారు 100 టన్నులు అంటే లక్ష కిలోల పసిడిని దేశీయ ఖజానాలో చేర్చింది. దీంతో 1991 తర్వాత ఈ స్థాయిలో బంగారాన్ని తరలించడం ఇదే తొలిసారని చెబుతున్నారు. కాగా... అప్పట్లో ఆర్థిక సంక్షోభం కారణంగా పెద్దఎత్తున పసిడి నిల్వలను భారత్‌ తనఖా పెట్టాల్సివచ్చింది.

వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల కేంద్ర బ్యాంకులు.. ఇంగ్లాండ్ లోని "బ్యాంక్ ఆఫ్‌ ఇంగ్లండ్‌" లో తమ బంగారాన్ని నిల్వ చేస్తుంటాయి. ఇదే క్రమంలో భారత్ కూడా అక్కడే పెద్దఎత్తున బంగారాన్ని నిల్వ చేస్తూ ఉంటుంది. 2024 మార్చి ముగిసేనాటికి ఆర్బీఐ వద్ద వద్ద 822.1 టన్నుల బంగారం ఉండగా... దీంట్లో 413.8 టన్నులు ఇతర దేశాల్లో నిల్వ చేసి ఉంచింది.

ఇటీవల కొన్నేళ్లుగా వరుసగా పసిడిని కొనుగోలు చేస్తూ వచ్చిన బ్యాంకు గత ఏడాది 27.5 టన్నుల పసిడిని కొత్తగా నిల్వల్లో చేర్చింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కొనుగోళ్ల జోరు మరింత పెంచింది. ఇందులో భాగంగానే 2023 మొత్తం కంటే ఒకటిన్నర రెట్లు అధిక బంగారం ఈ ఏడాది జనవరి- ఏప్రిల్‌ వ్యవధిలోనే కొనుగోలు చేసింది.

ఇలా ఇంగ్లాండ్ నుంచి తాజాగా తరలించబడ్డ బంగారాన్ని దేశీయంగా ముంబయి మింట్‌ రోడ్డు సహా నాగ్‌ పుర్‌ లోని పాత కార్యాలయాల్లో ఆర్బీఐ నిల్వ చేస్తుంటుంది. ఇక ఈ బంగారాన్ని భారత్‌ కు తీసుకొచ్చేందుకు తొలుత ఆర్థికశాఖ నుంచి ఆర్బీఐ కస్టమ్స్‌ సుంకం మినహాయింపు తీసుకుంది. అయితే... సాధారణంగా అన్ని దిగుమతులపై వర్తించే ఐజీఎస్టీ మాత్రం తప్పలేదు.

ఇంత భారీ స్థాయిలో బంగారాన్ని భారత్‌ కు తరలించేందుకు ఆర్బీఐ అధికారులు ప్రత్యేక విమానాన్ని ఉపయోగించారు. దీనికోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏది ఏమైనా... తాజా తరలింపుతో ఆర్బీఐ నిర్వహణ వ్యయాలు స్వల్ప స్థాయిలో తగ్గుతాయి. కారణం... ఇప్పటి వరకు బంగారం నిల్వ చేసినందుకు బ్యాంక్‌ ఆఫ్ ఇంగ్లాండ్‌ కు చెల్లించిన రుసుము ఇకపై చెల్లించనక్కరలేదు.