Begin typing your search above and press return to search.

విధ్వంసాన్ని ఆపకుంటే హిమాలయాలు కనుమరుగు?

భారతదేశానికి కోటలా ఉంటూ.. రక్షణగా నిలిచే హిమాలయ పర్వతాలు కనుమరుగు కానున్నాయా? అంటే అవుననే చెబుతోంది తాజా రిపోర్టు

By:  Tupaki Desk   |   4 March 2024 6:16 AM GMT
విధ్వంసాన్ని ఆపకుంటే హిమాలయాలు కనుమరుగు?
X

భారతదేశానికి కోటలా ఉంటూ.. రక్షణగా నిలిచే హిమాలయ పర్వతాలు కనుమరుగు కానున్నాయా? అంటే అవుననే చెబుతోంది తాజా రిపోర్టు. మహా అయితే మరో 75 ఏళ్ల తర్వాత అలాంటి పరిస్థితి ఉందని చెబుతున్నారు. భూమిపై అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల్ని అడ్డుకోకుంటే ఇలాంటి పరిస్థితే కచ్ఛితంగా నెలకొంటుందని చెబుతున్నారు. ఇండియా పర్యావరణ నివేదిక 2024లో ఇదే అంశాన్ని హెచ్చరించారు.

2100 నాటికి హిమాలయ పర్వతాల్లోని 75 శాతం మంచు కరిగిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీంతో వరదలు.. విపత్తులు సంభవిస్తాయని పేర్కొన్నారు. అంతేకాదు.. పర్యావరణానికి.. జీవజాలానికి.. వ్రక్ష జాతులకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఈ పరిణామాల కారణంగా ఆసియా ఖండంలోని 200 కోట్ల మంది ప్రజలు ప్రభావితం అవుతారని వెల్లడించింది.

భూగోళంలో అత్యధికంగా మంచు నిల్వ ఉన్న మూడో అతి పెద్ద ప్రాంతం హిమాలయాలే. కాలుష్యం.. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా ఇక్కడి హిమానీనదాలు కరిగిపోతున్న దుస్థితి. ఎగువ హిమాలయాల్లో ఉన్న మంచు ఇప్పటికే చాలా వరకు మాయమైందని.. 2013-2022 మధ్య ఇండియాలో చోటు చేసుకున్న పలు విపత్తులకు హిమగిరుల్లో మంచు కరగటమే కారణంగా పేర్కొంది.

తాజా రిపోర్టు ప్రకారం చూస్తే.. ప్రజలంతా పర్యావరణ సంక్షోభం అంచున ఉన్నట్లుగా చెప్పాలి. హిమాలయాల్లో మంచు కరిగిపోవటం కారణంగా విలువైన వ్రక్ష సంపదను కోల్పోతున్నట్లుగా పేర్కొన్నారు. ప్రతి పదేళ్లకు 54 మీటర్ల మేర చెట్లు కనుమరుగు అవుతున్నట్లుగా నివేదిక పేర్కొంది. ఉత్తరాది రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న వరదలు.. పెను తుఫాన్లు.. కొండ చరియలు విరిగిపడటం లాంటి విపత్తులు మరింత ఎక్కువ అవుతాయని హెచ్చరిస్తున్నారు.

2004 నుంచి 2020 మధ్య కాలంలో 840 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మంచు కరిగిందని.. ఆ ప్రాంతమంతా మైదాన ప్రాంతంగా మారిందని.. హిమాలయాల్లోని 40 శాతం మంచు కరిగిందని.. ఇలాంటి పరిస్థితే కంటిన్యూ అయితే 75 శాతం మంచు 2100 నాటికి కనుమరుగు అవుతుందని పేర్కొంది. ముప్పు ముంగిట్లో ఉన్న వేళ.. పర్యావరణం మీద ప్రభుత్వాలు.. ప్రజలు మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.