ఏఐ గర్ల్ ఫ్రెండ్ తో ప్రమాదాలపై గూగుల్ ఎక్స్ సీఈవో షాకింగ్ కామెంట్స్!
ఇప్పటికే చాలా మంది ఏఐ గర్ల్ ఫ్రెండ్ తో చాటింగ్లు చేస్తుండగా.. మరికొంతమంది పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉన్నారు.
By: Tupaki Desk | 27 Nov 2024 4:30 PM GMT"గర్ల్ ఫ్రెండ్ లేదని బాధపడుతున్నారా?... ఇకపై ఆ బాధలేదు!"... "అమ్మాయిలు వద్దు.. ఏఐ గర్ల్ ఫ్రెండ్ ముద్దు" వంటి శీర్షికలతో ఏఐ గర్ల్ ఫ్రెండ్ కు సంబంధించిన కథనాలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది ఏఐ గర్ల్ ఫ్రెండ్ తో చాటింగ్లు చేస్తుండగా.. మరికొంతమంది పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉన్నారు.
ఇక ఇంకొంతమంది సంగతైతే చెప్పే పనేలేదు. వారు తమ తమ ఏఐ గర్ల్ ఫ్రెండ్స్ ని ఇప్పటికే వివాహం చేసుకున్నట్లు ప్రకటించారు కూడా! ఈ స్థాయిలో చాలా మంది జీవితాల్లో ఏఐ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చి చేరిపోయారు. ఈ సమయంలో గూగుల్ మాజీ సీఈవో షాకింగ్ డిటైల్స్ వెల్లడించారు. ఏఐ గర్ల్ ఫ్రెండ్స్ తో పొంచి ఉన్న ప్రమాదాలను వివరించారు!
అవును... గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ స్మిత్ ఇటీవల యువకులు ఏఐ గర్ల్ ఫ్రెండ్స్ ని కలిగి ఉండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా... ఏఐతో డేటింగ్ వాస్తవానికి ఒంటరితనాన్ని పెంచుతుందని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. సాంకేతికత యొక్క ఊహించని సమస్యకు ఏఐ గర్ల్ ఫ్రెండ్ ఒక మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు.
వాస్తవానికి ఏఐ సంబంధాలలో యువకులు మాత్రమే కాదని, దీనికి సంబంధించిన యాప్ వినియోగదారుల్లో 35 ఏళ్లు పైబడినవారు ఎక్కువగా ఉన్నారని రెప్లికా యాప్ సీఈవో వెల్లడించారు. దీనిపై స్పందించిన స్మిత్... ముఖ్యంగా యువకులే ఈ విషయంలో ఎక్కువ హానిని కలిగి ఉంటారని నమ్ముతున్నట్లు తెలిపారు.
ఈ విషయంలో తల్లితండ్రులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. తమ పిల్లలు ఏమేమి చేస్తున్నారనే విషయాలను కొంతవరకూ మాత్రమే నియంత్రించగలరని.. ఆన్ లైన్ ఫ్లాట్ ఫారంల కోసం వయసుకు సంబంధించి అన్ని నియమాలూ ఉన్నప్పటికీ.. టీనేజర్లు హానికరమైన కంటెంట్ ను యాక్సెస్ చేయకుండా నిరోధించడానికి తగినంత చేయడం లేదని అన్నారు.