తన ‘ఓటమి’ 6 నెలల ముందే తెలుసట.. మరీ పార్టీ ఓడుతుందనీ తెలుసా?
ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. నియోజకర్గం మారినా విజయం మాత్రం చేజారలేదు.
By: Tupaki Desk | 14 Feb 2025 7:09 AM GMTతెలంగాణలో 15 నెలల కిందట జరిగిన ఎన్నికల్లో అధికార మార్పిడి.. పదేళ్ల బీఆర్ఎస్ పాలన పోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం రావడం.. ఇవన్నీ అందరికీ తెలిసిన చరిత్ర. వాస్తవానికి బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని ఎక్కువ శాతం మంది భావించారు. ఏ కొందరో రాజకీయం బాగా తెలిసినవారే అప్పటి ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించారు. ఇప్పుడు మాత్రం ఓ నాయకుడు ఓటమి ఆరు నెలలు ముందుగానే తెలిసిందని అంటున్నారు.
ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. నియోజకర్గం మారినా విజయం మాత్రం చేజారలేదు. తొలిసారి ఎన్నికల్లో తప్ప దాదాపు మూడు దశాబ్దాలు ఓటమి అన్నదే ఎరుగరు. అలాంటాయన 2023 నవంబరులో జరిగిన ఎన్నికల్లో తన రాజకీయ అనుభవం అంత వయసు కూడా లేని మహిళా అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆయనే వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
వరంగల్ లో ఆయన మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోతానని తనకు ఆరు నెలల ముందే తెలిసిందన్నారు. కానీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రోత్సాహంతో పోటీచేశానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎన్నికలొస్తే భారాసకు 100 సీట్లు ఖాయమన్నారు. కేసీఆర్ దార్శనికతతో పాలిస్తే.. 15 నెలల్లోనే కాంగ్రెస్ అన్ని రంగాల్లో దివాలా తీయించిందని విమర్శించారు. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదన్నారు.
సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారని, ఆయనకు 6 నెలలుగా రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ పనితీరుపై వాకబు చేయడానికి వరంగల్ రావడానికి రాహుల్ యత్నించారని, అయితే, తన నిజస్వరూపం బయటపడుతుందని ముఖ్యమంత్రి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి రాహల్ పర్యటనను రద్దు చేయించారన్నారు.
కాగా ఎర్రబెల్లికి తన ఓటమి ఆరు నెలల ముందే తెలిస్తే.. పార్టీ ఓటమి కూడా తెలిసి ఉండాలి కదా? అనే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. మరి ఆయన పార్టీకి ఈ విషయం చెప్పారా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎర్రబెల్లి తమకు క్షేత్రస్థాయిలో ఎదురుగాలి వీస్తోందనే విషయాన్ని అయినా చేరవేశారా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.