వరంగల్ 'కారు'.. పొలిటికల్ బేజారు!
అన్నగారు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీతో అరంగేట్రం చేసిన ఆయన పాలకుర్తి నుంచి వరుస విజయాలు అందుకున్నారు.
By: Tupaki Desk | 21 Jun 2024 7:30 AM GMTఒక్క ఓటమి.. నాయకులనే కాదు.. పార్టీలను కూడా మార్చేస్తుంది. మళ్లీ అధికారంలోకి వస్తుందో.. రాదో.. అనే ఆలోచన కన్నా... కూడా.. ప్రస్తుతం పరిస్థితినే నాయకులు భేరీజు వేసుకుంటారు. ఆదిశగానే అడుగు లు వేస్తారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే తరహా పరిస్థితి తెరమీదికి వచ్చింది. కీలకమైన ఉద్యమ జిల్లా.. ఒకప్పుడు బీఆర్ ఎస్‌కు కంచుకోటగా ఉన్న జిల్లా ఉమ్మడి వరంగల్. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి జిల్లాలో రాజకీయాలు మారుతూ వచ్చాయి. కీలక నేతలైన.. కడియం శ్రీహరి వంటివారు.. పార్టీకి రాంరాం చెప్పారు.
ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. కొందరు పార్టీ మారితే.. ఇక, పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ ఎస్ కారుకు నాలుగు చక్రాలు పంక్ఛర్లు కావడంతో ఇతర నాయకులు కూడా దూరమవుతున్నారు. ఈ క్రమంలో నే బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇప్పుడు మరోషాక్ కూడా తగల నుంది. టీడీపీ నుంచి బీఆర్ ఎస్‌లోకి వెళ్లి.. తర్వాత మంత్రి పదవి కూడా అందుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా.. కారు దిగిపోతున్నారని పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం నాలుగేళ్ల యినా.. నాయకులు మనగలగాలి. వ్యాపారాలు, వ్యవహారాలు ఎలా ఉన్నా.. వ్యక్తిగత దాడులు పెరిగిపోయిన నేపథ్యంలో గతంలో మాదిరిగా ప్రతిపక్షాన్ని అంటిపెట్టు కునే రోజులు తగ్గిపోయాయి. ముఖ్యంగా జంపిగులు అయితే.. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారు. ఈ క్రమంలోనే దయాకర్ రావు కూడా.. పార్టీమార్పుపై ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 30 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్న దయాకర్ రావు.. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు.
అన్నగారు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీతో అరంగేట్రం చేసిన ఆయన పాలకుర్తి నుంచి వరుస విజయాలు అందుకున్నారు. తర్వాత.. కేసీఆర్ ప్రోద్బలంతో బీఆర్ ఎస్ బాటపట్టిన ఎర్రబెల్లి మంత్రిగా కూడా పనిచేశారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ సమరంలో ఆయన ఓడిపోయారు. దీనికితోడు పార్టీ కూడా ఓడిపోవడంతో ఆయన బీఆర్ ఎస్‌కు దూరంగా ఉంటున్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక, ఇప్పుడు ఆయన దూకుడు పెంచారని తెలుస్తోంది. మరి ఏ పార్టీలోకి వెళ్తారనేది చూడాలి. గతంలో రేవంత్ రెడ్డితో ఉన్న పరిచయాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉందని అంటున్నారు .