"పేదరికమా?"... మస్క్ మాటలపై తండ్రి ఎర్రాల్ షాకింగ్ కామెంట్స్!
ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కు, తన తండ్రి ఎర్రాల్ మస్క్ కు మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 31 Jan 2025 11:30 AM GMTప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కు, తన తండ్రి ఎర్రాల్ మస్క్ కు మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయం అనేకసార్లు నిరూపణ అయ్యిందని చెబుతారు. ఈ సమయంలో ఇటీవల ఎలాన్ మస్క్ చెప్పిన చిన్ననాటి పేదరికం మాటలపై తండ్రి ఎర్రాల్ మస్క్ స్పందించారు. ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అవును... తాను చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. వారసత్వంగా తనకు ఎలాంటి ఆస్తిపాస్తులు రాలేదని ఎలాన్ మస్క్ గతంలో చెప్పారు. ఇదే సమయంలో.. తన తండ్రి ఓ చిన్న ఇంజినీరింగ్ సంస్థను స్థాపించి.. 20 - 30 ఏళ్లు సక్రమంగా సాగినా.. ఆ తర్వాత అది కష్టాల్లో పడిందని.. అప్పుడు తాను, తన సోదరుడు దాన్ని గట్టెక్కించామని తెలిపారు.
ఈ వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రాల్ మస్క్ స్పందించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. ఎలాన్ మస్క్ చేసిన పేదరికం వ్యాఖ్యలను తోసిపుచ్చారు. అందులో వాస్తవం లేదని అన్నారు. తాను 24 ఏళ్లకే సొంతంగా వ్యాపారం ప్రారంభించినట్లు తెలిపారు. పగలూ రాత్రి తేడా లేకుండా పనిచేసినట్లు చెప్పారు.
ఈ క్రమంలోనే ఆ వ్యాపారంలో సక్సెస్ అయ్యి.. సొంతంగా ఎయిర్ క్రాఫ్ట్ కూడా కొనుగోలు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా.. ఇళ్లు, కారు వంటి సౌకర్యాలతో పాటు మంచి జీవితం ఉండేదని అన్నారు. ఫలితంగా.. ఎలాన్ మస్క్ స్కూలుకు రోల్స్ రాయిస్ కారులో వెళ్లేవాడని ఆయన ఓ షో లో వెల్లడించారు.
మరోవైపు ఇదే విషయంలో గతంలో స్పందించిన ఎలాన్ మస్క్ తల్లి మాయే మస్క్... 1990లో తమ ఆర్థిక పరిస్థితి గురించి వెల్లడిస్తూ.. అప్పట్లో ఎలాన్ మస్క్ బ్యాంక్ లో ఉద్యోగం చేసేవాడని తెలిపారు. ఆ సమయంలో జాబ్ కు వెళ్లడానికి సరైన దుస్తులు లేక 99 డాలర్లతో కొన్న ఒకేఒక్క సూట్ ను ప్రతీరోజూ ధరించేవాడని పేర్కొన్నారు.
కాగా.. ఎలాన్ మస్క్ తన తండ్రిని 2016లో కలిశారు. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో సోదరుడు కింబల్ మస్క్ తో కలిసి తండ్రి 70వ బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. అనంతరం.. ఏడేళ్ల తర్వాత స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ప్రయోగ కార్యక్రమానికి హాజరయ్యారు.