రూపాయి కూడా లేదంటూ ఈటెల సంచలన కామెంట్స్...!
ఈటెల తాజాగా హుజూరాబాద్ లో ప్రచారం చేస్తూ తన నిరాశను నిరాసక్తను వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 16 Nov 2023 2:30 AM GMTబీజేపీలో కీలక నేతగా ఉన్న ఈటెల రాజేందర్ హ్యపీగా లేరా అన్న చర్చ అయితే సాగుతోంది. ఆయన అనుకున్నట్లుగానే ఏమీ సాగడంలేదా అన్నది కూడా ప్రశ్నలుగా తలెత్తుతున్నాయి. ఈటెల తాజాగా హుజూరాబాద్ లో ప్రచారం చేస్తూ తన నిరాశను నిరాసక్తను వ్యక్తం చేశారు.
ఈసారి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే స్థితిలో తాను లేనే లేను ఆయన అంటున్నారు. గత ఉప ఎన్నికల్లో కేసీయార్ తనను చాపను రాకినట్లుగా రాకాడని అంటే పూర్తిగా ఇబ్బంది పెట్టారని ఈటెల వ్యాఖ్యానించారు. అందువల్ల తాను ప్రస్తుతం కొన ఊపిరితో మాత్రమే ఉన్నాను అని ఈటెల అంటున్నారు.
ఇక తన దగ్గర ఏమీలేదని కేవలం రూపాయి కూడా ఖర్చు పెట్టలేనని ఆయన అంటున్నారు కేవలం ధైర్య లక్ష్మి మాత్రమే తన వద్ద ఉందని ఆయన అంటున్నారు. ఇలా నిరాశావాదంతో ఈటెల చెప్పడం విశేషం తన దగ్గర డబ్బులు లేవు కానీ తాను రాజకీయం చేస్తున్నాను అని ఆయన అన్నారు. కేవలం డబ్బుతోనే రాజకీయాలు కాదని రుజువు చేయాలని ఆయన కోరుతున్నారు. డబ్బులు లేకపోయినా తాను ప్రజల కోసం ఉన్నానని తనని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అని ఆయన అన్నారు.
ఇతర పార్టీలు ఓటుకు రెండు నుంచి మూడు వేల దాకా ఇస్తున్నాని వారి వద్ద డబ్బులు ఇస్తే తీసుకోండి కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయాలని ఈటెల కోరడం విశేషం. తన శక్తి తన బలం అంతా హుజూరాబాద్ ప్రజలే అని ఈటెల అంటున్నరు.
ఇదిలా ఉండగా పోలింగ్ దగ్గరపడుతున్న తరుణంలో ఈటెల రాజేందర్ ఈ తరహా కామెంట్స్ చేయడం వెనక ఆంతర్యం ఏమి ఉంటుంది అని అంతా ఆలోచిస్తున్నారు. నిజానికి ఈటెల బీజేపీలో ఉన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. మరి ఆ పార్టీ తన అభ్యర్ధులను ఆదుకోదా అండగా నిలబడదా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది.
ఈటెల కేవలం హుజూరాబాద్ లోనే కాదు గజ్వేల్ లో కూడా పోటీకి దిగుతున్నారు. అది కూడా కేసీయార్ మీదనే ఏకంగా పోటీ పడుతున్నారు. మరి డబ్బులు లేవని ముందే చేతులెత్తేస్తే ఎలా అన్నదే అనుచరుల ఆవేదనగా ఉంది. హుజూరాబాద్ లో అయితే ఈటెల అనేక సార్లు గెలిచిన నియోజకవర్గం కాబట్టి ఆయన పలుకుబడి సరిపోతుంది, గజ్వేల్ లో అలా కాదు, పైగా ముఖ్యమంత్రి మీద పోటీ మరి ఈటెల ఎందుకు ఇంత బేలగా మాట్లాడారు అన్నదే చర్చకు వస్తోంది.
బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణా మీద ఆశలు వదులుకుందా అందుకే ఇక్కడ అభ్యర్ధుల విషయంలో ఏమీ ఆలోచించడం లేదా అన్న డౌట్లూ వస్తున్నాయి. ఏకకాలంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరగడంతో బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్న చోటనే బీజేపీ తన వనరులను వాడుతోందా అన్నది కూడా ప్రశ్నగా ఉందని అంటున్నారు. ఈటెల వంటి కీలక నేతే ఇలా మాట్లాడితే బీజేపీకి తెలంగాణాలో హోప్స్ ఎంతవరకూ అన్నది కూడా చూడాలని అంటున్నారు.