కాంగ్రెస్ కి బాబు మద్దతు...ఈటెల సంచలన కామెంట్స్...!
చంద్రబాబు తెలంగాణాలో కాంగ్రెస్ ని పైకి లేపడానికి చూస్తున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు.
By: Tupaki Desk | 2 Nov 2023 2:22 AM GMTచంద్రబాబు తెలంగాణాలో కాంగ్రెస్ ని పైకి లేపడానికి చూస్తున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు 2018లో కాంగ్రెస్ తో పొత్తు బాహాటంగా పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారని, ఈసారి అలా కాకుండా తాను పోటీ నుంచి తప్పుకుని తెర వెనక మద్దతు ఇస్తున్నారని ఈటెల విమర్శించారు.
తెలంగాణా రాజకీయాలలో చంద్రబాబు వేలు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ గెలుపు కోసం చంద్రబాబు పనిచేస్తున్నారని ఆయన కీలక కామెంట్స్ ని చేశారు. కాంగ్రెస్ కి ఎవరు మద్దతు ఇచ్చినా ఎందరు లోపాయికారీగా సాయం చేసినా ఆ పార్టీ గెలిచేది లేదని ఈటెల అంటున్నారు.
కాంగ్రెస్ తరఫున గత ఎన్నికల్లో 19 మందిని గెలిపిస్తే అందులో ఏకంగా పన్నెండు మంది ఎమ్మెల్యేలు బీయారెస్ లోకి ఫిరాయించారని ఈటెల గుర్తు చేశారు. ఇపుడు కూడా అదే జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ సంగతి జనాలకే బాగా తెలుసు అన్నారు. కాంగ్రెస్ కి ఓటేసినా బీయారెస్ కి వేసినా ఒక్కటే అని ఆయన అంటున్నారు.
ఇదిలా ఉండగా చంద్రబాబు మీద ఇప్పటిదాకా డైరెక్ట్ గా ఏ ఒక్క నేతా కామెంట్స్ చేయలేదు. చంద్రబాబు 52 రోజుల పాటు జైలు జీవితం గడపి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆయన హైదరాబాద్ కి బుధవారం రాత్రి చేరుకున్నారు. బాబు ఇంట్లో లేకపోతే ఆసుపత్రిలో ఉండాల్సి ఉంది.
కోర్టు ఆదేశాల మేరకు బాబు అలా చేయాల్సి ఉంది. అయితే బాబు సరిగ్గా తెలంగాణా ఎన్నికల వేళలో హైదరాబాద్ లో ఉండడం మీదనే చర్చ సాగుతోంది. బీజేపీ ఇపుడు స్టార్ట్ చేసింది. రేపటి రోజున బీయారెస్ నుంచి కూడా బాబు మీద విమర్శలు వచ్చినా రావచ్చు. నిజానికి అస్త్ర సన్యాసం చేసి టీడీపీ కూర్చుంది. బాబు అయితే బయటకు రాకుండా ఆంక్షలు ఉన్నాయి.
అయినా సరే బాబు మీద ఇపుడు వరస విమర్శలకు బీజేపీ రెడీ అవుతూంటే బీయారెస్ ఆ తోవలోనే ఉంది అంటున్నారు. ఈటెల బాబు మీద విమర్శలు చేయడానికి కారణం ఆ పార్టీకి నిన్నటిదాకా తెలంగాణా ప్రెసిడెంట్ గా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ బయటకు రావడం, ఆయన రాజీనామా చేస్తూ కాంగ్రెస్ కి టీడీపీ లోని ఒక వర్గం మద్దతు ఇస్తోందని బాహాటంగా కామెంట్స్ చేశారు.
ఆ ఆధారాలతోనే ఈటెల ఇపుడు విమర్శించారు అని అంటున్నారు. కాంగ్రెస్ కి బాబు మద్దతు ఇస్తున్నారు అని ప్రచారంలో ఉంది, అందుకే పోటీలో టీడీపీ లేదు అని కూడా అంటున్నారు. అయితే దాన్ని ఆసరాగా చేసుకుని విమర్శలు చేయడం మాత్రం బీజేపీకే చెల్లింది అని అంటున్నారు. ఇక బాబు వ్యూహాలు బీజేపీ పెద్దలకు కూడా తెలుసు అని అంటున్నారు.
దాంతో ఏపీలో బీజేపీ టీడీపీ పొత్తులకు మరింత గ్యాప్ ఏర్పడే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ కి లోపాయి కారీగా బాబు మద్దతు అంటూ వస్తున్న వార్తలను తీసుకుంటే ఇండియా కూటమి వైపుగా టీడీపీ సాగుతోందా అన్న కొత్త చర్చకు తెర లేస్తోంది. బాబు వ్యూహాలు తెలంగాణా తమ్ముళ్లకు అర్ధం అయినా కాకపోయినా బీజేపీ బీయారెస్ బయటకు తెచ్చి కామెంట్స్ చేసే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.