Begin typing your search above and press return to search.

రాజేందర్ ఈటల రూటు మారింది!

అవును... పార్లమెంట్‌ ఎన్నికల బరిలో బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌ మల్కాజ్‌ గిరి నుంచి పోటీ అంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   17 Jan 2024 4:27 AM GMT
రాజేందర్ ఈటల రూటు మారింది!
X

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన రెండు చోట్లా పరాజయం పాలైన తెలంగాణ బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇంద్లో భాగంగా నిన్నమొన్నటివరకూ ఆయన మల్కాజ్ గిరీ లోక్ సభ స్థానంనుంచి పోటీచేస్తారని కథనాలొచ్చిన వేళ... తాజాగా ఆయన రూటు మారిందని తెలుస్తుంది. ఈ మేరకు ఆ విషయాన్ని ఈటల తాజాగా వెల్లడించారు.

అవును... పార్లమెంట్‌ ఎన్నికల బరిలో బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌ మల్కాజ్‌ గిరి నుంచి పోటీ అంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆయన పార్టీ మారబోతున్నారని, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని మరోచోటు నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటూ ఊహాగాణాలు వెలువడ్డాయి. అయితే ఈ విషయంపై స్పందించిన ఆయన... కాంగ్రెస్‌ చేరడం లేదని చెబుతున్నప్పటికీ ప్రచారం మాత్రం ఆగడంలేదు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈటల ఈ విషయంపై స్పందించారు. హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన సందర్భంగా ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... అధిష్టాణం ఆదేశిస్తే... కరీంనగర్ నుంచి ఎంపీగా బరిలోకి దిగేందుకు సిద్ధమని అన్నారు. దీంతో... ఈటల మనసు మల్కాజిగిరీ నుంచి కరీంనగర్ కు మారినట్లుందనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది.

వాస్తవానికి కరీంనగర్ ఎంపీగా మరోసారి విజయఢంకా మోగించాలని బీజేపీ నేత బండి సంజయ్‌ తెగ కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా... బూత్ లెవల్ మీటింగ్స్ నిర్వహిస్తూ.. కార్యకర్తలతో ఓ భారీ సమావేశానికి బండి ఇప్పటికే స్కెచ్ వేశారని తెలుస్తుంది. అలా బండి సంజయ్ ప్రిపేర్ అయిపోతున్న చోట... అధిష్టాణం అవకాశమిస్తే తాను కరీంనగర్ నుంచి పోటీ చేస్తానని ఈటల చెప్పడం చర్చనీయాంశం అవుతుంది.

కాంగ్రెస్ అభ్యర్థి అంటూ...!:

ఆ సంగతి అలా ఉంటే... మరోవైపు కరీంనగర్ స్థానంలో ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండబోతున్నారనే ప్రచారం విపరీతంగా జరుగుతుంది! ఈటల మల్కాజిగిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. మల్కాజ్‌ గిరి కంటే.. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే కచ్చితంగా విజయం సాధించవచ్చని, మళ్లీ రాజకీయంగా స్ట్రాంగ్ కావచ్చని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.