Begin typing your search above and press return to search.

ఈటెల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు!

తాజాగా హుజురాబాద్‌ బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఈటెల రాజేందర్‌ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   12 Oct 2023 3:57 PM GMT
ఈటెల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు!
X

హుజురాబాద్‌ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటెల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఇక్కడా, అక్కడా పోటీ చేస్తానని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం ఈటెల హుజురాబాద్‌ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.

తాజాగా హుజురాబాద్‌ బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఈటెల రాజేందర్‌ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో అక్కడా, ఇక్కడా పోటీ చేసే అవకాశం ఉందని.. తనను కార్యకర్తలే గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

కాగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. గతంలోనే కేసీఆర్‌ బరిలో ఉండే గజ్వేల్‌ నుంచి తాను పోటీ చేస్తానని ఈటెల రాజేందర్‌ సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ ఎక్కడ నిలబడితే అక్కడ నుంచి పోటీ చేస్తానని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్‌ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. ఈటెల కూడా వచ్చే ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈటెల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్‌ తోపాటు కేసీఆర్‌ పోటీ చేసే చోట ఈటెల పోటీ చేయొచ్చని అంటున్నారు.

అయితే కేసీఆర్‌ రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతుండటంతో ఈటెల గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తారా లేక కామారెడ్డి నుంచి పోటీ చేస్తారా అనేదానిపై చర్చ జరుగుతోంది.

మరోవైపు ఈసారి హుజురాబాద్‌ నుంచి తన భార్య జమునను బరిలోకి దింపి ఈటెల రాజేందర్‌.. కేసీఆర్‌ పోటీ చేసే రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగే వీలుందని పేర్కొంటున్నారు.

అయితే ఈటెల ఆలోచనకు బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుదనేది ఆసక్తికరంగా మారింది. ఈటెలకు రెండు చోట్ల పోటీ చేసే చాన్సు ఇస్తుందా, లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది.

కాగా ఇప్పటివరకు ఈటెల వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో తొలిసారి కమలాపూర్‌ నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున గెలుపొందిన ఈటెల 2008లో తెలంగాణ ఉద్యమసాధనలో భాగంగా తన పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో తిరిగి గెలుపొందారు. ఇక 2009లో కమలాపూర్‌ రదై్ద హుజురాబాద్‌ నియోజకవర్గం ఏర్పడింది. దీంతో అక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున బరిలోకి దిగి గెలుపొందారు. మళ్లీ రాష్ట్ర సాధన కోసం 2010లో రాజీనామా చేసి ఉప ఎన్నికలో విజయం సాధించారు. మళ్లీ 2014, 2019ల్లోనూ టీఆర్‌ఎస్‌ తరఫున వరుస విజయాలు అందుకున్నారు. 2021లో టీఆర్‌ఎస్‌ కు రాజీనామా బీజేపీ తరఫున హుజురాబాద్‌ నుంచి పోటీ చేసి మరోసారి ఘన విజయం సాధించారు.