ఆగని ఈటల.. బీజేపీలోకి ఆ మాజీ మంత్రి?
బీజేపీలో తనకు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాత్రం తనదైన మార్గంలో దూసుకుపోతున్నారనే చెప్పాలి
By: Tupaki Desk | 14 Sep 2023 8:51 AM GMTబీజేపీలో తనకు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాత్రం తనదైన మార్గంలో దూసుకుపోతున్నారనే చెప్పాలి. పార్టీలో చేరికల విషయంలో ఈటల దూకుడు కొనసాగిస్తున్నరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలపై పార్టీలోని అగ్ర నాయకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైందని సమాచారం. అయినప్పటికీ ఈటల తన పని తాను చేసుకుపోతున్నారనే చెప్పాలి. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు చిత్తరంజన్ దాస్ ను బీజేపీలోకి రప్పించే ఈటల ప్రయత్నిస్తున్నారు.
సీనియర్ రాజకీయ నాయకుడు జక్కుల చిత్తరంజన్ దాస్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో ఆయన.. నందమూరి తారక రామారావుపై విజయం సాధించడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. కానీ 1999లో టికెట్ దక్కకపోవడంతో టీడీపీలో చేరారు. మళ్లీ కాంగ్రెస్ కూటికి వెళ్లి.. 2018లో కొల్లాపూర్ లేదా జడ్చర్ల నుంచి పోటీకి ప్రయత్నించారు. కానీ టికెట్ దక్కకపోవడంతో 2019లో బీఆర్ఎస్లో చేరారు. కానీ ఇప్పుడు కల్వకుర్తి టికెట్ను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కే కేసీఆర్ కేటాయించడంతో చిత్తరంజన్ దాస్ అసంత్రుప్తితో ఉన్నారు.
ఈ నేపథ్యంలో రాజకీయాల్లో అనుభవం ఉన్న చిత్తరంజన్ దాస్ ను బీజేపీలో చేర్చుకుంటే ప్రయోజనం కలిగే అవకాశముందనే ఉద్దేశంతోనే ఆయనతో ఈటల తాజాగా భేటీ అయ్యారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి చిత్తరంజన్ నివాసంలో ఈటల చర్చలు జరిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో చిత్తరంజన్ బీజేపీలో చేరడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల మాజీ మంత్రి క్రిష్ణ యాదవ్ ను బీజేపీలో చేర్పించేందుకు ఈటల సిద్ధమయ్యారు. ముహూర్తం కూడా నిర్ణయించారు. కానీ కిషన్ రెడ్డి అడ్డుపడటంతో చివరి నిమిషంలో క్రిష్ణ యాదవ్ తో పాటు ఈటలకు కూడా బ్రేక్ పడింది. కానీ ఇవేమీ పట్టనట్లు ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్గా ఉన్న ఈటల తన పని తాను చేసుకుంటూ పోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.