ఇదేం సవాల్.. ఈటల సార్!
అయితే.. ఈ సవాల్‌లో పసలేకపోగా.. అందరూ నవ్వుకునేలా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 19 March 2024 6:04 PM GMTరాజకీయాలలో నేతలు సవాళ్లు విసరడం కామనే. ప్రత్యర్థులను లక్ష్యం చేసుకుని రాజకీయ నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు రువ్వుతా రు. ఇవి ఆక్షణానికి కొంత సంచలనంగా మారతాయి. తర్వాత.. అందరూ మరిచిపోతారు. అయితే.. ఇలా సవాళ్లు రువ్వేవారు ఇటీవ ల కాలంలో హద్దులు మీరుతున్నారు. ఇదిలావుంటే.. తాజాగా బీజేపీ నాయకుడు, గత ఏడాది జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి ఓడిపోయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఒక సవాల్ రువ్వారు. అయితే.. ఈ సవాల్‌లో పసలేకపోగా.. అందరూ నవ్వుకునేలా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
బీజేపీ తరఫున మల్కాజిగిరి టికెట్ పొందిన ఈటల రాజేందర్.. తాజాగా నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌కు సవాల్ రువ్వారు. ``రేవంత్ రెడ్డీ.. ఇక్కడ మల్కాజిగిరికి చెందిన వ్యక్తినే దింపు. లేకపోతే.. నేనేంటో చూపిస్తా`` అంటూ సవాల్ విసిరారు. దీనిలో అర్ధం ఏంటో ఆయనకైనా అర్ధమైందా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. ఏపార్టీ అయినా.. తనకు నచ్చిన అభ్యర్థిని రంగంలోకి దింపుతుంది. అలా అనుకుంటే హుజూరాబాద్‌కు, మల్కాజిగిరికి ఈటలకు సంబంధం లేదు. అయినా.. బీజేపీ ఆయనకు టికెట్ ఇచ్చింది. దీనిని ఎవరూ ప్రశ్నించలేదు కదా!
``నాకు మల్కాజ్‌గిరితో ఏం సంబంధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు... అలాంటప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ ప్రాంతం వాడినే నిలబెట్టాలి. లేదంటే ఆయన సంగతి చెబుతా`` అని ఈటల రాజేందర్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మల్కాజ్‌గిరి ప్రాంతం వాడినే తనపై పోటీకి నిలపాలని సవాల్ చేశారు. ``మల్కాజ్‌గిరితో తనకు ఏం సంబంధం? అని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రికి నేను ఓ సవాల్ విసురుతున్నాను... నిజంగా నీకు దమ్ముంటే ఈ ప్రాంతం నుంచి తనపై పోటీకి నిలుపు`` అని అన్నారు. బయటి వ్యక్తిని నిలబెడితే ఊరుకునేది లేదన్నారు. రేవంత్ రెడ్డి అభ్యర్థి కోసం వెతుకుతున్నాడని... రూ.200 కోట్లు ఖర్చు పెట్టే అభ్యర్థి వారికి కావాలట అని ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్‌ను తట్టుకోవాలంటే రూ.400 కోట్లు ఖర్చు పెట్టే వ్యక్తి కావాలని పేర్కొన్నారు.