కేసీఆర్ తో తనకున్న పంచాయితీని రివీల్ చేసిన ఈటల
ప్రభుత్వంలో జరిగే తప్పులను అంతో ఇంతో ఎత్తి చూపే ధైర్యం తన ఒక్కడికే ఉండేదని ఈటల వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 8 May 2024 4:43 AM GMTఉద్యమ కాలం నుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు గులాబీ బాస్ కు తలలో నాలుకలా వ్యవహరించిన ఈటల రాజేందర్ ఇప్పుడు బీజేపీలో ఉండటం.. మల్కాజ్ గిరి ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండటం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ తో కలిసి రెండు దశాబ్దాలకు పైనే ప్రయాణించిన ఈటలకు.. గులాబీబాస్ పంచాయితీ ఎందుకు వచ్చింది. దాని వెనుకున్న అసలు కారణమేంటి? అన్న ప్రశ్నలకు తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల ఓపెన్ అయ్యారు.
ప్రభుత్వంలో జరిగే తప్పులను అంతో ఇంతో ఎత్తి చూపే ధైర్యం తన ఒక్కడికే ఉండేదని ఈటల వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని తాను చెప్పటమే కాదు.. అప్పట్లో కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రులుగా వ్యవహరించిన జూపల్లి.. తుమ్మల.. కడియం.. పట్నం మహేందర్ రెడ్డిలకు కూడా తెలుసన్నారు. ఇప్పుడు వారు గుండెల మీద చేయి వేసుకొని అసలు విషయాన్ని చెప్పాలన్నారు.
ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీద చెప్పే అలవాటు తనకు ఉంటుందన్న ఈటల.. ఈ కారణంగానే తాను కేసీఆర్ కు దూరమైనట్లుగా పేర్కొన్నారు. హౌసింగ్ పాలసీ మీద అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కమిటీ వేశారని.. తనతో పాటు హరీశ్.. తుమ్మల.. ఇంద్రకరణ్ రెడ్డి.. కడియం శ్రీహరి ఉన్నట్లు చెప్పారు. అయితే.. తాము స్టడీ చేసి ఇవ్వకముందే.. నాటి సీఎం కేసీఆర్ హౌసింగ్ పాలసీ గురించి ప్రకటన చేసేసినట్లుగా గుర్తు చేశారు. ఈ సందర్భంలోనే తుమ్మల.. కడియం ఇద్దరు నొచ్చుకున్నారన్న విషయాన్ని బయటపెట్టారు.
కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులకు ఏ మాత్రం విలువ ఉండేది కాదని.. తాను అనుకున్నది చేసేవారని.. మంత్రుల్ని సంప్రదించేవారు కాదని ఈటల చెప్పారు. కేసీఆర్ పాలనలో మంత్రులకు ఉన్న విలువ ఏమిటో అర్థం చేసుకోవచ్చన్న ఆయన.. కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. ముచ్చటగా మూడోసారి మోడీనే దేశ ప్రధాని అవుతారన్న విశ్వాసాన్ని ఈటల వ్యక్తం చేశారు.