టైమ్స్ నౌ - ఈటీజీ సర్వే... తెలంగాణలో హస్తం హవా!
ఇదే సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ సత్తా చాటాలని బీజేపీ భావిస్తుంది.
By: Tupaki Desk | 9 March 2024 6:44 AM GMTమరో నెలరోజుల్లో తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలూ ప్రచారాలకు భారీగా తెరలేపిన సంగతి తెలిసిందే. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటినట్లే ఈ ఏడాది జరగబోయే లోక్ సభ ఎన్నికల్లోనూ గెలిచి నిలవాలని.. గత గెలుపు గాలివాటం కాదని చాటిచెప్పాలని కాంగ్రెస్ పార్టీ బలంగా భావిస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ సత్తా చాటాలని బీజేపీ భావిస్తుంది.
మరోపక్క... అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిందని చెబుతూ.. ఆ ప్రభావం తమకు అనుకూలంగా మారుతుందని భావిస్తూ.. తెలంగాణలో అధికారం కోల్పోయినంతమాత్రాన్న తమ బలం తగ్గిపోలేదని చాటిచెప్పాలని బీఆరెస్స్ భావిస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టైమ్స్ నౌ - ఈటీజీ సర్వే ఫలితాలు తెరపైకి వచ్చాయి.
అవును... అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని, ఆరు గ్యారెంటీల అమలుపైనా దృష్టిసారించామని, బీఆరెస్స్ పై ప్రజల్లో వ్యతిరేకత లోక్ సభ ఎన్నికల్లోనూ రిఫ్లెక్ట్ అవుతాదని చెబుతున్న కాంగ్రెస్... ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటుతుందని టైమ్స్ నౌ - ఈటీజీ సర్వే వెల్లడించింది. ఇదే సమయంలో బీఆరెస్స్ మూడోస్థానానికి పరిమితమయ్యే అవకాశం ఉందని తెలిపింది.
తాజాగా తెరపైకి వచ్చిన టైమ్స్ నౌ - ఈటీజీ సర్వే ఫలితాలు... తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటబోతుందని తెలిపింది. ఇందులో భాగంగా... రాష్ట్రంలో ఉన్న 17 లోక్ సభ స్థానాలకు గానూ అధికారపార్టీకి 8 - 10 స్థానాల్లో గెలుపు తథ్యమని చెబుతుంది. అదేవిధంగా... బీజేపీ 4 - 6 స్థానాల్లో గెలిచే అవాశం ఉందని.. బీఆరెస్స్ మాత్రం 2 - 4 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యేలా పరిస్థితులు ఉన్నాయని తెలిపింది.
ఈ సర్వే ఫలితాలను బట్టి చూస్తే.. రాబోయే లోక్ సభ ఎన్నికల్లోనూ బీఆరెస్స్ కు పరాభవం తప్పదని తెలుస్తుంది! మరీ 2 - 4 స్థానాల్లో మాత్రమే బీఆరెస్స్ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే చెప్పుతుండటంతో... వారి పరిస్థితి ఇంత దయణీయంగా ఉందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
టైమ్స్ నౌ - ఈటీజీ సర్వే ఫలితాలు: తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు 2024
కాంగ్రెస్ పార్టీ: 8 - 10
బీజేపీ: 4 - 6
బీఆరెస్స్: 2 - 4
ఇతరులు: 0
కాగా... టైమ్స్ నౌ - ఈటీజీ.. ఏపీకి సంబంధించిన ఫలితాలను కూడా వెల్లడించింది. ఈ ఫలితాల ప్రకారం ఏపీలోని 25 లోక్ సభ స్థానాల్లోనూ అధికార వైసీపీ 21 - 22 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఇదే సమయంలో... టీడీపీ - జనసేన కూటమి 3 - 4 స్థానాలకు పరిమితమవుతుందని వెల్లడించింది.